తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగానే ఉన్నది. దానికి కారణం తెలంగాణలో సరైన నాయకత్వం లేకపోవడం. అందుకే.. అర్జెంట్ గా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ ను పక్కన పెట్టేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా.. తెలంగాణలో పార్టీ పరంగా ఎటువంటి మార్పు రాలేదు. దీంతో కాస్త దూకుడు ఉన్న నేతలకు, యువనేతలకు ఇక నుంచి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది.
అయితే.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలే క్యూలో ఉన్నా… తెలంగాణలో కాస్తో కూస్తో పార్టీ పరువును కాపాడుతున్న అతికొద్ది మంది నాయకుల్లో రేవంత్ రెడ్డి ఒకరు. తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు రేవంత్. అందులోనూ ఆయనకు దూకుడెక్కువ. ఎవ్వరినీ పట్టించుకోడు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించడంలో దిట్ట. అందులోనూ రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పీఠంపై ఎప్పటి నుంచో కన్ను ఉంది.
ఇప్పటికే జాతీయ స్థాయిలో పార్టీలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది సోనియమ్మ. తర్వాత తెలంగాణ మీదనే తన దృష్టిని కేంద్రీకరించిందట. ఇప్పటికే.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా తమిళనాడుకు చెందిన ఠాగూర్ ను నియమించింది. ఆయన విరుధ్ నగర్ ఎంపీ, యువకుడు కూడా. ఇక నుంచి యువనాయకులకే పదవులు ఇస్తామని సోనియా దీంతోనే సంకేతాలు పంపినట్టయింది.
ఇక.. పీసీసీ రేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఉన్నారు. అయితే… మొదటి నుంచి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది. కానీ.. మిగితా కాంగ్రెస్ నాయకులు మాత్రం రేవంత్ కు ఎలా ఇస్తారంటూ అడ్డుపుల్ల వేస్తున్నారు. దశాబ్దాల నుంచి పార్టీకి విధేయులుగా ఉండి తాము పనిచేస్తుంటే.. నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు.
కానీ… టీఆర్ఎస్ కు దీటుగా ఎదుర్కొనే సత్తా రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని హైకమాండ్ గ్రహించింది. అందులోనూ కొత్త ఇంచార్జి ఠాగూర్ తోనూ రేవంత్ కు మంచి సంబంధాలు ఉండటంతో రేవంత్ నే పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే… రేవంత్ కన్న కల నెరవేరినట్టే.