తెలంగాణలో కేసీఆర్ ఎంత పెద్ద శక్తి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థులనేవారే లేకుండా రాజకీయం చేయాలనుకునే స్థాయిలో కేసీఆర్ ఉన్నారు. అందుకే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని పతాక రచన చేశారు. ఆ పార్టీలోని నేతలను తెలివిగా తనవైపుకు లాక్కుని కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేశారు. కాళ్ళ ముందే పార్టీ క్షీణించుకుపోతున్నా కాంగ్రెస్ లీడర్లు చేష్టలుడిజి చూడటం తప్ప కేసీఆర్ స్పీడుకు బ్రేకులు వేయలేకపోయారు. ఈనాడు సీనియర్లమని చెప్పుకుంటూ పదవుల కోసం పోట్లాడుకుంటున్న లీడర్లంతా ఒడ్డున కూర్చుని చేతులు నలుపుకున్నారే తప్ప పోరాటానికి దిగలేదు.
సరిగ్గా ఆ సమయానికే రేవంత్ రెడ్డి పార్టీలోకి ప్రవేశించారు. రావడంతోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కించుకున్న ఆయన మొదటిరోజు నుండే కేసీఆర్ మీద తన యుద్దాన్ని ఆరంభించారు. అధికార పార్టీని అడుగడుగునా ఎండగడుతూ ముందుకు సాగారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ ఒక్కడే ఢీకొట్టాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన గత ఆరేడేళ్లలో ఏ రాజకీయ నాయకుడూ కూడ రేవంత్ రెడ్డి చేసినంత సాహసం చేయలేదు. అంతెందుకు కాంగ్రెస్ లేదా బీజేపీలో కేసీఆర్ సరిగ్గా ఒక వారం రోజులు పోరాటం సలిపిన నేత ఎవ్వరూ లేరు.
ముఖ్యమంత్రిని ధిక్కరించడం అంటే ఎన్ని కష్టాలు వస్తాయో చెప్పనక్కర్లేదు. రేవంత్ రెడ్డి కూడ అలాంటి వాటిని ఎన్నింటినో చూశాడు. జైలుకు సైతం వెళ్ళాడు. ఇలా సర్వం ఒడ్డి రేవంత్ పోరాడుతుంటే కాంగ్రెస్ పెద్దలు ఆయనకు చేయి అందించాల్సిందిపోయి అడ్డం పడుతున్నారు. రేవంత్ ఎదో పరాయివాడన్నట్టు ఫీలైపోతూ ఆయనకు అంత సీన్ ఎందుకు ఇస్తున్నారు, మేమంతా లేమా పార్టీని నడపడానికి అంటూ రేవంత్ మీద విమర్శలు చేస్తున్నారు. కొన్నిరోజులు వీరి వైఖరి చూసిన రేవంత్ ఇక లాభం లేదనుకుని అందరినీ వదిలేసి సహకరించే ఆ కొద్దిమందినే కలుపుకుని ఫైట్ చేస్తున్నారు, అనుకున్నట్టే అధికార పక్షాన్ని అడుగడుగునా ఎదిరిస్తూ అసలు ప్రతిపక్షం అంటే రేవంత్ రెడ్డే అనే రీతిలో ఎదుగుతున్నారు. ఇకనైనా కాంగ్రెస్ పెద్దలు పంతాలయు వీడి కలిసి పోరాడితే మరింత ప్రయోజనం పొందవచ్చు.