కేసీఆర్, కేటీఆర్ లను ఎక్కువగా కంగారుపెడుతున్న ఒకే ఒక విషయం రేవంత్ రెడ్డి. రెండు దఫాలు అధికారం చేపట్టిన తెరాస గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఏ రాజకీయ ప్రత్యర్థినీ రేవంత్ రెడ్డిని తీసుకున్నంత సీరియస్ గా తీసుకోలేదనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలను కేవలం తమ మాటలతోనే బెదరగొట్టగలిగిన కేసీఆర్, కేటీఆర్ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం తీవ్ర తర్జన భర్జనకు గురవుతున్నారు. తాము ఎక్కువ దృష్టి పెట్టి రేవంత్ రెడ్డి మీద ప్రతిదాడికి దిగితే చేతులారా ఆయన్ను హీరోను చేసినట్టే అవుతుంది. అలాగని చూస్తూ ఊరుకుంటే రేవంత్ రోజు రోజుకూ విమర్శల దాడిని తీవ్రం చేస్తున్నాడు. దీంతో ఎన్నడూ లేని విధంగా తెరాస ఇరుక్కునపడిపోయింది. చిన్నదైనా పెద్దదైనా.. తమ ప్రభుత్వం మీద విమర్శ అంటూ వస్తే దాన్ని తిప్పికొట్టేవరకు కేసీఆర్ నిద్రపోయేవారు కాదు.
అందుకు ఉదాహరణే భట్టి విక్రమార్క ఇంటికి తలసానిని పంపడం. నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ కడుతున్నారు, అసలు ఎక్కడున్నాయో చూపాలని కాంగ్రెస్ విసిరిన సవాల్ స్వీకరించిన కేసీఆర్ తలసాని పంపి భట్టిని నగరంలో తిప్పి మరీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, ఇళ్ల స్థలాలను చూపించారు. కానీ రేవంత్ విసురుతున్న సవాళ్ళను మాత్రం స్వీకరించలేకపోతున్నారు. ఉద్యమకారులను అణచివేసి పెట్టుబడిదారులకు టికెట్లు ఇచ్చారని, రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులను చంపే కుట్ర చేస్తున్నారని, నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించడంలో, కరోనా కట్టడిలో విఫలమయ్యారని, సచివాలయం కూల్చి ప్రజాధనం నాశనం చేస్తున్నారని ఇలా అనేక రకాలుగా రేవంత్ కేసీఆర్, కేటీఆర్ మీద విమర్శలు గుప్పిస్టున్నారు.
సచివాలయం కూల్చివేత విషయంలో అయితే ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇవన్నీ చాలవన్నట్టు తెరాస నుండి బడుగు బలహీన వర్గాలను పక్కకు లాగేసై ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవలే తెరాస శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం, బీసీలంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలిపునివ్వడం చూస్తే రేవంత్ తెరాస పార్టీని సామాజికవర్గాల వైపు నుండి దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తెరాసను దెబ్బకొట్టడానికి రేవంత్ చాలానే వ్యూహాలు రచిస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు తెరాసకు నష్టం కలిగించకపోవచ్చు. కానీ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగానే సమయం ఉంది. ఈలోపు రేవంత్ రెడ్డి పన్నాగాలన్నీ ఫలిస్తే తెరాసకు కలిగే నష్టం భారీగానే ఉంటుంది. కనుక ఇప్పటి నుండే ఆయన్ను అదుపుచేయాలి. కానీ తండ్రీ కొడుకులు ఆ పని చేయలేకున్నారు. ఇదే వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.