మీకు గుర్తుందా? ఓటుకు నోటు కేసు. అప్పట్లో ఈ కేసు సంచలనాన్నే సృష్టించింది. ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో జరిగిన ఘటన అది. అది చంద్రబాబు మెడకు కూడా చుట్టుకుంది. అప్పుడయితే చంద్రబాబును అరెస్ట్ చేస్తారు? అనే వార్తలను కూడా మనం చదివాం. అయితే.. ఆ కేసు నుంచి చంద్రబాబు అయితే ఎలాగోలా తప్పించుకున్నారు కానీ.. ఆ కేసు నుంచి మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం బయటపడేలా లేరు. ఇంకా ఆ కేసు రేవంత్ ను బాధిస్తూనే ఉన్నది.
ఆ కేసుపై ఇప్పటికీ ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి వస్తోంది. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. రేవంత్ తో పాటు.. టీడీపీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య, మరికొందరు నిందితులు హాజరయ్యారు.
ఈ కేసుతో తమకు సంబంధం లేదని.. తమ పేర్లు తొలగించాలంటూ.. సండ్ర వెంకటవీరయ్యతో పాటు.. ఉదయ సింహ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయగా.. దానిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించింది.
దానిపై ఏసీబీ అధికారులు తాజాగా కౌంటర్ దాఖలు చేయడంతో.. నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు.. సండ్ర, ఉదయ సింహా మరోసారి కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది.
ఈ కేసుకు సంబంధించి అసలు నిందితులు ఎవరు.. అనేది ఇప్పటి వరకు కోర్టు తేల్చలేదు. కానీ.. ఈ కేసు రేవంత్ రెడ్డికి రాజకీయంగా చాలా అడ్డంకిగా ఉంది.
ప్రస్తుతం రేవంత్ టీడీపీ పార్టీలో లేరు. అయినా కూడా ఆ పార్టీలో ఉన్న సమయంలో జరిగిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఆయన లేనిపోని చిక్కుల్లో పడాల్సి వస్తోందని ఆయన బాధపడుతున్నట్టు సమాచారం. చూద్దాం.. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?