రేవంత్ రెడ్డి వ్యూహానికి చిక్కిన గులాబీ నేతలు.?

రేవంత్ రెడ్డితో పోల్చితే అగ్రెసివ్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలామందే వున్నారు. రాజకీయ అనుభవం లెక్కల్లోకి తీసుకున్నా, రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి అవకాశాలు తక్కువ. కానీ, సాధించారు. ఎలా.? కాంగ్రెస్ అధిష్టానం అన్నీ ఆలోచించే రేవంత్ రెడ్డిని రంగంలోకి దించింది.. అదీ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి షాకిచ్చేలా. పక్కా ప్లానింగ్‌తో రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితిపై రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి అర్థమయ్యే భాషలోనే సమాధానమిస్తున్నారు రేవంత్ రెడ్డి. అక్కడే తెలంగాణ రాష్ట్ర సమితికి ఒళ్ళు మండిపోతోంది. ‘మేం తిడితే ఎవడైనా పడాల్సిందే.. అంతే తప్ప, మమ్మల్ని ఎవరూ తిట్టకూడదు..’ అన్నట్టు వ్యవహరిస్తోంది టీఆర్ఎస్. ఈ వైఖరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ ఇస్తోంది.

మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడిన వైనంతో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ పరువు పోయింది. ‘ఓ మంత్రి ఇంతలా దిగజారి మాట్లాడతారా.? కేసీయార్ మరీ ఇంత కుసంస్కారుల్ని ప్రత్యర్థుల మీదకు ఉసిగొల్పుతారా.?’ అంటూ తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతోంది. నిజానికి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు లేదు. బీజేపీ ఎంత గింజుకున్నా, కాంగ్రెస్ ఎన్ని పిల్లి మొగ్గలేసినా.. ఆ రెండు పార్టీలూ తెలంగాణలో గులాబీ పార్టీకి చెక్ పెట్టేంత బలంగా లేవు. మరెందుకు, ఆయా పార్టీల మీద అంత ఘాటుగా గులాబీ నేతలు విరుచుకుపడ్డం.? అధినేత మెప్పు కోసం మల్లారెడ్డి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అంతేనా, తెలంగాణ రాష్ట్ర సమితి పరువుని బజార్న పడేసింది. ఏదో అవుతుందనుకుంటే, ఇంకోటేదో అయ్యిందన్నట్టు తయారైంది పరిస్థితి. కేసీయార్, గులాబీ నేతల్ని కంట్రోల్ చేయకపోతే, కారు పార్టీకి డ్యామేజ్ చాలా తీవ్రంగా జరిగే అవకాశముంది.