జనసేన పార్టీ నేత నాగబాబు రాజకీయాల్లోకి ఎంటరైనప్పటి నుండి అగ్రెసివ్ అయ్యారు. అంతకు ముందు పలు విషయాల మీద మీడియాలో లేదా సోషల్ మీడియాలో స్పందిస్తూ వచ్చిన ఆయన ఎక్కువగా తన కుటుంబపరమైన విషయాల మీదే ఎక్కువగా మాట్లాడేవారు. కానీ 2019 ఎన్నికలకి కొన్ని నెలల ముందు జనసేనలో చేరిన ఆయన ఆ తర్వాత పంథా మార్చుకున్నారు. ఎంపీగా ఎనికల్లో ఓడినా కూడా మంచి ఓటింగ్ శాతం రావడంతో మరింత స్పీడ్ అందుకున్నారు. ప్రజాసమస్యల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద గట్టిగా తన అభిప్రాయాలను వినిపించడం స్టార్ట్ చేశారు. తమ్ముడు పవన్ మీద ఎవరైనా అనవసర వ్యాఖ్యలు చేస్తే విరుచుకుపడుతూ పార్టీలో ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నారు.
కానీ ఈమధ్య ఆయనలో స్పీడ్ కొంచెం తగ్గింది. తాజా హాట్ ఇష్యూ మూడు రాజధానుల బిల్లు విషయంలో ఇప్పటివరకు స్పందించలేదు. మామూలుగా ఆయన స్పీడుకు యూట్యూబ్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో ఆయన వాయిస్ గట్టిగా వినబడేది. అమరావతిని కాదన్న వైసీపీ మీద, భూములు సేకరించి ఇప్పుడు నిస్సహాయంగా చేతులు తిప్పేసిన టీడీపీ మీద విరుచుకుపడేవారు. కానీ ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఒక్క వీడియో కూడా చేయలేదు. ఇందుకు కారణం కొద్దిరోజుల క్రితం జరిగిన గాంధీ, గాడ్సేల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ నుండి పరోక్ష వ్యతిరేకత వ్యక్తమవడం ఇక రీజన్ అయితే తమ మిత్ర పక్షం బీజేపీని ఏమీ అనకూడని పరిస్థితి ఉండటం.
రాజధానిగా అమరావతికి జనసేన కట్టుబడి ఉంది. ఇప్పటికీ పవన్ స్టాండ్ అదే. కానీ మూడు రాజధానుల బిల్లు ఆమోదం వెనుక తమ మిత్ర పక్షం బీజేపీ పాత్ర ఎంత ఘనమైనదో జనసేనకు తెలుసు. వారితో పొత్తులో ఉండటంతో వారు సహకరించిన బిల్లును పెద్ద ఎత్తున ఖడించలేరు. అలాగని తమ నిర్ణయాన్ని మార్చుకోలేరు. అందుకే పవన్ కొంచెం నెమ్మదిగా కరోనా కష్టాల్లో రాజధానుల గోల అవసరమా, అయినా తాము తుదకంటా రైతుల పక్షాన పోరాడతాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నాగబాబుగారికి అలా కర్ర విరగకుండా, పాము చావకుండా మెత్తగా వ్యవహరించడం తెలీదు. చస్తే పామైనా చావాల లేదా చేతిలో కర్రైనా విరగాలి అనుకునే ముక్కుసూటి రకం. అందుకే మెల్లగా మాట్లాడి అరకొర బిల్డప్ ఇవ్వడం ఎందుకని ఆయన సైలెంట్ అయినట్టు అనిపిస్తోంది.