రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యకాలంలో చాలా త్వరగా ఓకే చేసిన సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చుట్టూ ఎన్నో ఆఫర్లు ఉన్నా, చేయాల్సిన సినిమాలు క్యూలో ఉన్నా అందరినీ పక్కనపెట్టి ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. ఇది చూసి ప్రశాంత్ నీల్ కాబట్టి డేట్స్ ఇచ్చాడని అంతా అనుకున్నారు. అయితే ఈ సినిమా వెనుక విషయం వేరే ఉంది. అసలు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి భారీ లెవల్ సినిమా చేయాలని అనుకున్నారు. దానికి నిర్మాత దిల్ రాజు. ముగ్గురూ కలిసి చర్చలు జరిపారు. ప్రాజెక్ట్ ఓకే అనుకున్నారు. సినిమా మైథలాజికల్ సబ్జెక్ట్. ‘బాహుబలి’ కంటే చాలా పెద్ద ప్రాజెక్ట్.
మొదలుపెట్టాలంటే ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేయాలి. కానీ ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయాలనే తపనతో ఉన్న ప్రభాస్ ఈలోపు తక్కువ సమయంలో పూర్తయ్యే సినిమా ఏదైనా చేద్దామని ప్రశాంత్ నీల్ తో చెప్పాడట. దానికి ప్రశాంత్ నీల్ సైతం ఓకే చెప్పి ‘సలార్’ స్టోరీ వినిపించారట. అది బాగా నచ్చడంతో ప్రభాస్ డేట్స్ ఇవ్వడం, సినిమా మొదలవడం చకచకా జరిగిపోయాయి. అంటే ఈ సినిమాను ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికకు జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే అనుకోవచ్చు. అసలు సిసలు భారీ ప్రాజెక్ట్ ముందుంది. ఈ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ కంటే కూడ చాలా పెద్దదట.