తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అత్యద్భుతంగా వుందంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం విదితమే. భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు.. ధరణి అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్, ఆంధ్రపదేశ్ పేరుని తెరపైకి తెచ్చారు. ఆంధ్రపదేశ్‌లో భూముల ధరలు తగ్గాయన్నారు. ఆ వ్యవహారం సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం తెలంగాణ రియల్ రంగంలో అనూహ్యమైన కుదుపు కన్పిస్తోంది. రియల్ దందా.. అంటూ మీడియా కోడై కూసేస్తోంది. వెంచర్ల పేరుతో వినియోగదారుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు దోచేస్తున్న వైనం గురించి న్యూస్ చానళ్ళు, పత్రికలు పుంఖానుపుంఖాలుగా కథనాల్ని వండి వడ్డిస్తున్నాయి. అనూహ్యంగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఓ ఆడియో టేపు ఇప్పుడు తెరపైకొచ్చింది ఈ దందాకి సంబంధించి.
ఓ వెంచర్ విషయంలో రియల్టర్‌కి మంత్రి మల్లారెడ్డి వార్నింగ్ ఇచ్చిన ఆడియో టేపు అది. ‘వెంచర్ వేసుకున్నావు.. నాకు మామూలు ఎందుకు ఇవ్వలేదు.?’ అని మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నట్టుగా వుంది ఆ ఆడియో టేపులో. అయితే, సదరు రియల్టర్ తాను సర్పంచ్‌కి మామూలు ఇచ్చినట్లు చెబితే, ‘సర్పంచ్‌కి మామూలు ఇస్తే సరిపోతుందా.? నాకు డబ్బులిచ్చేవరకు వెంచర్‌లో పనులు నడవడానికి వీల్లేదు..’ అని మంత్రి మల్లారెడ్డి హెచ్చరిస్తున్న వైనం కూడా ఆ ఆడియో టేపులో వుంది. ఇప్పుడీ ఆడియో టేపు న్యూస్ ఛానళ్ళలో మార్మోగిపోతోంది. గతంలోనూ మంత్రి మల్లారెడ్డిపై భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలున్నాయి. ఇక, తాజా ఆడియో టేపు వ్యవహారంపై మంత్రి మల్లారెడ్డి ఇంకా స్పందించాల్సి వుంది. మరోపక్క, రియల్టర్ల చేతుల్లో మోసపోయిన కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు.. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో తమను రియల్టర్లు నిండా ముంచేశారన్నది కొనుగోలుదారుల ఆరోపణ. మరోపక్క ఇది వేల కోట్ల కుంభకోణమనీ, పెద్ద తలకాయల ప్రమేయం లేకుండా ఇది జరిగే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.