డ్రగ్స్.. పోర్న్.. ఈ కేసుల్లో దోషులెవరు చెప్మా.?

కొండని తవ్వి ఎలకను పడితే సరే.. ఆ ఎలకని కూడా పట్టలేకపోతే.? అటు పోర్న్ రాకెట్ కేసులోనూ, ఇటు డ్రగ్స్ రాకెట్ కేసులోనూ దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పోర్న్ వీడియోల రాకెట్ విషయానికొస్తే, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టయ్యాడు.. సీ-గ్రేడ్ హీరోయిన్లు కూడా ఒకరిద్దరు అరెస్టయ్యారు.. కానీ, ఆ కేసు అలా అలా సాగుతూనే వుంది. ఈ కేసలో ప్రధాన నిందితుడైన రాజ్ కుంద్రా బెయిల్ మీద తాజాగా విడుదలయ్యాడు. ఇక, డ్రగ్స్ రాకెట్ విషయానికొస్తే, బాలీవుడ్ మాత్రమే కాదు, కన్నడ సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ కూడా ఉలిక్కిపడ్డాయి. పలువురు అరెస్టయ్యారు (కన్నడ సినీ పరిశ్రమ నుంచి, హిందీ సినీ పరిశ్రమ నుంచి), కొందరు విచారణ ఎదుర్కొంటున్నారు (పై మూడు సినీ పరిశ్రమల నుంచీ).

చివరికి ఈ కేసులో ఏం తేలబోతోంది.? ‘సరైన ఆధారాల్లేవు..’ అంటూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయమై ఓ చర్చ జరుగుతోంది. ఇంతకీ, ఏది నిజం.? బెయిల్ రావడమంటే, రాజ్ కుంద్రా క్లీన్ చిట్ తెచ్చుకున్నట్టు కాదు. రాజ్ కుంద్రాపై బలమైన అభియోగాలు మోపడంలో, ఆయన్నుంచి సరైన సమాచారం రాబట్టి, వేగవంతంగా కేసు విచారణ పూర్తి చేయడంలో విచారణాధికారులు విఫలమయ్యారని లెక్క. కన్నడ, తెలుగు సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ ఆరోపణల వ్యవహారానికి సంబంధించి కూడా భిన్న వాదనలు, బోల్డన్ని ఆరోపణలు తెరపైకొస్తున్నాయి. దోషి.. అని న్యాయస్థానం తేల్చేదాకా ఎవరి మీదా నిందలు వేయలేం. అదే సమయంలో, కేసు విచారణలో వున్నంతవరకు క్లీన్ చిట్.. అని ఎవరి విషయంలోనూ చెప్పలేం. ఏళ్ళ తరబడి ఈ కేసుల విచారణ సాగుతూ సాగుతూ వుంటే.. అది మొత్తంగా వ్యవస్థల పట్ల ప్రజలకున్న గౌరవం తగ్గిపోయేందుకు కారణమవుతుంది.