రాయలసీమ రగడ.. మళ్ళీ ఇప్పుడెందుకు తెరపైకి.?

మాజీ మంత్రి మైసూరారెడ్డి అడపా దడపా ‘రాయలసీమ’ నినాదంతో రాజకీయ తెరపై ఇలా కన్పించి అలా మాయమవుతుంటారు. గ్రేటర్ రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ.. ఇలా చాలా డిమాండ్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వినిపించాయి. అది, సమైక్య ఉద్యమానికి ఎంత పెద్ద దెబ్బగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మళ్ళీ ఇప్పుడు.. 13 జిల్లాల ఆంధ్రపదేశ్‌లో మళ్ళీ ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వినిపిస్తుండడం వెనుక రాజకీయ కుట్ర ఏంటి.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా, రాయలసీమను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నది ప్రస్తుతం నడుస్తోన్న వివాదం.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపైనా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ – ఏపీ మధ్య నీటి వివాదంపై కేంద్రం స్పందించడం, కృష్ణా అలాగే గోదావరి నదులకు సంబంధించి మేనేజ్‌మెంట్ బోర్డుల్ని ఏర్పాటు చేయడం తెలిసిన సంగతులే. ఇది రాయలసీమకు నష్టం చేసే అంశమని మైసూరారెడ్డి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరపాటుతో, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిందని మైసూరారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యేక రాయలసీమ అంశాన్ని ప్రస్తావించారు. ఇదెక్కడి వింత.? తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై రచ్చ జరుగుతున్న సమయంలో మైసూరారెడ్డి ఎక్కడ.? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పదవులు వెలగబెట్టిన మైసూరారెడ్డి, అప్పుడెందుకు రాయలసీమ గురించి నిలదీయలేకపోయారు.? ఒక్కటి మాత్రం నిజం.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకతీతంగా ఒక్కతాటిపై నిలబడాల్సిన సందర్భమిది. అప్పుడే, కృష్ణాతోపాటు గోదావరి నీటి పంపకాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. లేదంటే, రాష్ట్రం విభజన ఉద్యమాలతో మరోమారు నష్టపోయే ప్రమాదముంది.