పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయినా, పోటీ చేసిన రెండు చోట్లా తాను పరాజయం చెందినా అవమానం ఫీలవలేదు, పెద్దగా బాధపడలేదు. పోరాటంలో గెలుపోటములు సహజం, ఓటమిని భరించలేకపోతే గెలుపుకు అర్హులం కాలేము అంటూ ముందుకు నడిచారు. నాయకుడి మాటలతో జనసైనికులు సైతం త్వరగానే కోలుకుని పార్టీ తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఇలా ఓటమి నుండి అనూహ్యరీతిలో కోలుకున్న పవన్ సొంత మనిషి చేసిన ద్రోహానికి మాత్రం చింతిస్తున్నారు. జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో రాపాక వరప్రసాద్ కు పార్టీలో స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది.
అందరూ రాపాక మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీలో పవన్ ఆలోచనలను, నిర్ణయాలను రాపాక గట్టిగా వినిపిస్తారని భావించారు. కానీ రాపాక వాళ్ల ఆశలను గల్లంతు చేస్తూ వైసీపీ టర్న్ తీసుకున్నారు. అసలు నాయకుడు పవన్‌కు విస్మరించి తన గెలుపు పూర్తిగా తన క్రెడిట్ అంటున్నారు. అధికార పార్టీతో సఖ్యతగా ఉంటేనే పనులు జరుగుతాయనే కారణం చెబుతూ సొంత పార్టీనే తప్పుబడుతున్నారు. రాపాక వ్యవహారం మీద పవన్ రెస్పాండ్ కాకపోయినా కడుపుమండిన జనసైనికులు ఘాటుగానే స్పందిస్తున్నారు. రాపాక అధికారం ఎంటుంటే అటే పోతారని విమర్శలకు దిగారు.
దీంతో రాపాక వర్గీయులు రంగంలోకి దిగారు. అధికారం మీద కోరిక రాపాకకు కాదని పవన్‌ని అంటూ ప్రతి విమర్శలు చేస్తున్నారు. కేవలం ప్రశ్నించడానికే పార్టీ అన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు. ఎన్నికల్లోకి దిగడం అంటే పవర్ కోసమే. ఒకప్పుడు అధికారం ఉన్న చంద్రబాబుతో స్నేహం చేసి ఆయన పని అయిపోగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇవన్నీ పవన్ అధికార దాహానికి సాక్ష్యాలు అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న వీరే 2019 ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు రాపాకను రిజెక్ట్ చేస్తే పిలిచి మరీ టికెట్ ఇచ్చిన పవన్‌కు, జనసేనకు భజన చేశారు. ఇప్పుడేమో అధికారపక్షం అండ దొరికేసరికి అవకాశం ఇచ్చిన నాయకుడినే కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఈ వెన్నుపోటును పవన్ సైతం ఊహించి ఉండరేమో.