సెక్స్ టేప్ వివాదం .. మంత్రి పదవికి రాజీనామా

కర్ణాటక భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి రమేష్ జర్కిహోళి రాజీనామా చేశారు. ఓ మహిళతో ఆయన రాసలీలలు సాగిస్తున్న వీడియో సీడీ బయటకు రావడంతో పెద్ద దుమారం రేగింది. దీంతో మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం బీఎస్ యడియూరప్పకు పంపారు. తన వద్దకు ఓ పని కోసం వచ్చిన ఓ మహిళను మంత్రి రమేష్ జర్కిహోళి లైంగికంగా వాడుకున్నారు. బెంగళూరులోని ఆర్‌టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్‌లను డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది.

దీని కోసం ఆయన లైంగికంగా వాడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త, పౌర హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేష్ కల్లహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తనకు న్యాయం చేయించాల్సిందిగా తనను కోరిందని ఆయన తెలిపారు. దినేష్ కల్లహళ్లి బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు కంప్లెయింట్ ఇచ్చారు.

గతంలో హెచ్ డీ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి జంప్ అయిన ఆయన చాలా మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపునకు తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత బీఎస్ యడియూరప్ప సీఎం అయ్యారు. రమేష్ జరకలిహోలికి ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల శాఖను కేటాయించారు. ఇప్పుడు వీడియో లీక్ కావడం, అది న్యూస్ చానళ్లలో ప్రసారం కావడంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను సీఎం యడియూరప్ప వెంటనే ఆమోదించారు.