RGV: టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా వర్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి వచ్చిన సమయం నుంచి ఏపీలో పెద్ద చర్చనీయాంశం అయింది. వర్మ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. తాజాగా వీటన్నిటి గురించి ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు రాంగోపాల్ వర్మ.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సర క్రితం నేను చేసిన పోస్ట్ కు నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విషయంలో నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాలేదు. వర్మను అరెస్ట్ చేస్తున్నామని వారు కూడా ఇంతవరకు తెలపలేదు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు గేటు బయటే ఎందుకున్నారు. అరెస్ట్ చేయాలనుకున్నవారు లోపలికి రావచ్చు కదా,కానీ వాళ్లు రాలేదు. ఈ కేసుల వెనక ఎవరున్నారని తెలుసుకునేందుకే నేను కోర్టుకు వెళ్లాను.
నేను బాగానే ఉన్నాను. అయితే ఎలా ఉన్నానంటూ నా సన్నిహితులు చూపుతున్న సానుభూతి భరించలేకున్నాను అని తెలిపారు వర్మ.
నేను ఎప్పుడో చేసిన పోస్ట్‌లపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు. నాపై కేసులు పెట్టిన ఆ తొమ్మిది మంది నా పోస్టులను ఇప్పుడే చూశారట. అందుకే కేసులు పెట్టారట. ఇది నమ్మే విషయమా? నేను కేసులకు భయపడను ఐ డోంట్ కేర్. న్యాయవ్యవస్థ అంటే నాకు గౌరవం ఉంది. పోలీసుల మీదా నమ్మకం ఉంది. చట్ట ప్రకారం వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తాను అని వర్మ దైర్యంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఒక్క ఇంటర్వ్యూ తో తనపై వస్తున్న చాలా రకాల వార్తలకు చెక్ పెట్టేశారు రాంగోపాల్ వర్మ.