రామ్ గోపాల్ వర్మ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘దిశ ఎన్కౌంటర్’. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాలో కంటెంట్ కంటే కాంట్రవర్సీ ఎక్కువగా ఉండేలా చూసుకునే వర్మ ఈ చిత్రాన్ని కూడ అదే దారిలో రూపొందించాలని అనుకున్నారు. అందుకే చిత్రానికి దిశ అనే పేరునే పెట్టారు. ఆయన అనుకున్నట్టే సినిమా మీద పెద్ద వివాదం రేగింది. తమ అనుమతి లేకుండా తమ కుమార్తె మీద సినిమా తీస్తున్నాడని దిశ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. అలాగే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వారి కుటుంబ సభ్యులు వర్మ మీద ఫైర్ అయ్యారు. వివాదం కోర్టుకు వెళ్ళింది. వర్మ కూడ తాను చేస్తున్నది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నించాడు.
కానీ సెన్సార్ బోర్డ్ సైతం సినిమాను వీక్షించి కొన్ని సన్నివేశాలను తొలగించాలని, దిశ టైటిల్ మార్చాలని సూచించింది. నిజానికి వర్మకు టైటిల్ మార్చడం అస్సలు ఇష్టం లేదు. అందుకే విషయం కోర్టు వరకు వెళ్ళింది. చివరికి సెన్సార్ బోర్డ్ పేరును మార్చాలని గట్టిగా చెప్పడంతో వర్మ తలొగ్గక తప్పలేదు. ఇప్పుడు కొత్త టైటిల్ వెతికే పనిలో ఉన్నాడు ఆయన. ఈ మార్పుకి కూడ తనదైన వివరణ ఇచ్చుకున్నారు ఆయన.తాను న్యాయపరమైన వివాదాలను, సెన్సార్ బోర్డ్ సభ్యుల ఆదేశాలను పాటిస్తానని, వివాదాస్పదమైన తన ప్రతి చిత్రం లీగల్ ప్రొసీడింగ్స్ దాటాకనే రిలీజ్ అవుతుందని, ఈ చిత్రం కూడ అంతేనని అంటూ టైటిల్ మారుస్తున్నట్టు చెప్పలేక చెప్పుకొచ్చాడు.