తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపిన రామ్ చరణ్..!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు, సెలబ్రిటీస్ తారక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిన్న రాత్రి కొందరు అభిమానులు ఏకంగా తారక్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన పుట్టినరోజును కేక్ కట్ చేసి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. చాలా సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఈ సినిమా ద్వారా అభిమానులకు తెలిసివచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ..” సోదరుడు, కోస్టార్, స్నేహితుడు.. నీతో నాకు ఉన్న బంధాన్ని వివరించడానికి మాటలు సరిపోవు తారక్.. మనమధ్య బంధాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. హ్యాపీ బర్త్ డే.. అంటూ రాంచరణ్ ఎంతో ఎమోషనల్ గా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా వారిద్దరూ ఎంతో చనువుగా హత్తుకున్న ఫోటో కూడా షేర్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.