Ram Charan: రామ్ చరణ్‌కి ఒక్కసారి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు: కమెడియన్

Ram Charan: రంగస్థలం సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చిన సమయంలోనే తన భార్య చనిపోయిందని ఆర్టిస్ట్ నాగ మహేష్ అన్నారు. తన అంత్యక్రియలు మిగతా కార్యక్రమాలు అయిపోయాక తాను షూటింగ్‌కు వెళ్తానని ఇంట్లో చెప్తే బంధువులంతా వ్యతిరేకించారని ఆయన చె‌ప్పుకొచ్చారు. ఆ టైంలో తన సొంతవారే తనకు శత్రువులయ్యారని ఆయన అన్నారు. ఆ సినిమాలో సమంత తండ్రిగా నటించే అవకాశం వచ్చిందంటే ఆ క్యారెక్టర్‌కి ఎంత ప్రాధాన్యత వస్తుందో మీకేం తెలుసు, మైత్రి మూవీస్ గురించి గానీ, రామ్ చరణ్ గురించి గానీ మీకు అర్థం కాదు అని తన వాళ్లతో వాగ్వాదం చేశానని ఆయన తెలిపారు. దాంతో వారంతా ఇక వాదించలేక తన నుంచి వెళ్లిపోయారని, ఆ తర్వాత తన పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి, మళ్లీ రెండు రోజుల్లో తిరిగి వస్తానని అక్కడి నుంచి రాజమండ్రిలో జరిగే షూటింగ్‌కు బయలుదేరానని నాగ మహేశ్ చెప్పారు.

బయలుదేరనైతే బయలుదేరాను గానీ తన బంధువులు చెప్పినట్టు తనకు ఏమైనా అవుతుందేమోనన్న భయం మాత్రం తనను వెంటాడుతూనే ఉందని నాగ మహేశ్ అన్నారు. బస్సులో వెళ్తున్నపుడు కూడా ఏదైనా వచ్చి తాను వెళ్త్తున్న బస్సును గుద్దేస్తదేమో అని కూడా భయపడ్డానని ఆయన చెప్పారు. గోదావరి తీరం వెంబడి వెళుతున్నపుడు అందులో పడిపోతానేమో, మునిగి పోతానేమో ఇలా అంతా నెగిటివ్ సెన్స్‌తోనే తన మనసంతా నిండిపోయిందని ఆయన అన్నారు.

ఇక అలా షూటింగ్‌కి వెళ్లగానే ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటంటే అక్కడ రామ్‌ చరణ్ గారు అయ్యప్ప మాలలో ఉన్నారని నాగ మహేశ్ చెప్పారు. తానేమో భార్య కర్మకాండ చేసి ఉన్నానని, అది తనకు ఓ అగ్నిపరీక్షలా తోచిందని ఆయన అన్నారు. అక్కడ సాంగ్ షూటింగ్ 4 రోజులు జరిగింది కానీ, ఎప్పుడు కూడా రామ్ చరణ్‌ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఆయన తనను చూడగానే గుర్తుపట్టారని, కానీ ఆ టైంలో ఆయన్ని చూడగానే ఏదో దడగా అనిపించేదని ఆయన అన్నారు. ఆయన పలకరించగానే తాను వెంటనే సర్ అని లేచి వెళ్లిపోయేవాడినని, ఎక్కడా ఆయన తనను తాకకుండా జాగ్రత్త పడ్డానని ఆయన చెప్పారు. కానీ తనకంటూ ఉన్న మనిషి ఈ సమయంలో ఉంటే ఎంత బాగుండో, ఎంత సంతోషించేదో కదా అని మాత్రం మనసులో చాలా బాధ పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంటికొచ్చేవరకూ కూడా తనకు ఏం అవుతుందో అన్న భయమే ఉందని, అంతగా ఆ సెంటిమెంట్ తనను వెంటాడిందని ఆయన చెప్పారు.