రామ భక్తులు వర్సెస్ రోమన్ ప్రభుత్వ భక్తులు.!

Ram Bhakts vs Roman Govt Bhakts

Ram Bhakts vs Roman Govt Bhakts

రామ భక్తులెవరు.? రోమన్ ప్రభుత్వ భక్తులు ఎవరు.? తెలుగు నాట రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌కి తెరలేపింది భారతీయ జనతా పార్టీ. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ హిందుత్వ ఎజెండాతో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకున్న మాట వాస్తవం. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగానూ బీజేపీ వ్యూహం ఫలించింది. అదే వ్యూహం తిరుపతిలో వర్కవుట్ అవుతుందా.? ఏమోగానీ, ఇక్కడ రామ భక్తులు వర్సెస్ రోమన్ ప్రభుత్వ భక్తులు.. అన్న ప్రచారమే కొంత వివాదాస్పదమువుతోంది. రోమన్ ప్రభుత్వ భక్తులంటే వైసీపీ శ్రేణులు.. రామ భక్తులు అంటే బీజేపీ శ్రేణులు అన్నది కమలనాథుల ఉద్దేశ్యం కావొచ్చు. ‘రామ భక్తుల జయ జయ ధ్వానాలు.. రోమన్ ప్రభుత్వ భక్తుల వెన్నులో వణుకులు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా.. అదీ బీజేపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పేర్కొనడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయాల్లో ఇలాంటి చర్యలు అవాంఛనీయం.

ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఏ గడ్డి తినడానికైనా సిద్ధమే. నిజానికి, రాష్ట్రంలో రాజకీయం ఏనాడో అత్యంత పతనావస్థకు దిగజారిపోయింది. చర్చిలకు చెందిన పాస్టర్లు ఓటర్ల దగ్గరకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేసి, వైసీపీకి అనుకూలంగా ఓటెయ్యాలని గతంలో ‘ప్రమాణం’ చేయించుకున్న సందర్భాలున్నాయంటారు కమలనాథులు. మైనార్టీల విషయంలోనూ వైసీపీ గతంలో ఇలాంటి వ్యూహమే రచించిందన్నది కమలనాథుల ఉవాచ. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ దర్శనమిస్తూనే వున్నాయి. ‘కుక్క కాటుకి చెప్పు..’ అన్న రీతిలో, బీజేపీ.. ఇలా ‘రామ భక్తులు.. రోమన్ ప్రభుత్వ భక్తులు’ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చిందేమో. కానీ, కేవలం మతం పేరు ప్రస్తావిస్తే, కుల ప్రస్తావన తీసుకొస్తే.. ఓట్లు రాలతాయనుకోవడం మూర్ఖత్వం.. అది ఏ పార్టీ చేసినాసరే అంతే.