తెలుగులో జోరు తగ్గించిన రకుల్.. ఎందుకంటే.!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అందులో నో డౌట్. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఉనికి తక్కువగానే ఉందనడంలో అతిశయోక్తి కాదు. అయితే, తెలుగులో రకుల్ హవా తగ్గడానికి పెద్ద కారణమే ఉందట. బాలీవుడ్ సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ చాలా బిజీగా ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం అక్కడ ఐదారు ప్రాజెక్టుల్లో రకుల్ నటిస్తోంది. ఇక టాలీవుడ్ విషయానికి వచ్చేద్దాం. రీసెంట్‌గా ‘కొండపొలం’ సినిమాతో రకుల్ హిట్ కొట్టింది. పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ రోల్ పోషించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో తెలుగులో మళ్లీ రకుల్ హవా పెరుగుతుందని అనుకున్నారంతా.

కానీ, రకుల్ ఏ మాత్రం జోరు చూపడం లేదు. ఆచి తూచి వ్యవహరించాలనుకుంటోందట. గతంలోలా గ్లామర్ డాళ్ పాత్రలు కాకుండా ఛాలెంజింగ్ రోల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోంది. ఛాలెంజింగ్ రోల్స్ వస్తే, అస్సలు వెనక్కి తగ్గనంటోంది. అవకాశం వచ్చింది కదా.. అని ఏది పడితే అది స్వీకరించనని కుండ బద్దలుకొట్టేస్తోంది ఓబులమ్మ.

ఓబులమ్మ పాత్ర తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందనీ, అది కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అనీ రకుల్ చెప్పుకొచ్చింది.