కరోనా ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో అన్ని సినిమా షూటింగ్స్ మళ్ళీ శరవేగంగా జరుపుకుంటున్నాయి. నటీనటులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్‌లో పాల్గొంటున్నప్పటికి ఈ మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొద్ది రోజుల క్రితం తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించింది. కరోనా నిర్ధారణ కావడంతో స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లినట్టు చెప్పిన రకుల్ , తనను కలిసి వ్యక్తులందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
దాదాపు పది రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉన్న రకుల్ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ యోగసనాలు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ వంటివి చేసింది. కపలాబాతి, ప్రాణాయామం లాంటి ఆసనాలను, వాటి విలువ గురించి ఎంతో చక్కగా వివరించింది. బెలూన్స్ ఊది ఊపిరితిత్తులకు ఆక్సీజన్ సరఫరా చేసింది. అయితే కరోనా నుండి రికవరీ అయ్యేందుకు తాను క్వారంటైన్ సమయంలో ఏమేం చేసిందనేది ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రకుల్ రికవరీ జర్నీ వీడియో షేర్ చేయగా దీనికి కొన్ని వేల లైకులు వస్తున్నాయి.
తనకు కరోనా నెగెటివ్ వచ్చిన విషయాన్ని కూడా రకుల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హాయ్ ఫ్రెండ్స్ నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. 2021ను పాజిటివ్ దృక్పథంతో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండి మాస్క్‌లు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుతున్నాను అని తన ట్వీట్‌లో రాసింది. రకుల్‌కు నెగెటివ్ రావడంతో ఆమె అభిమానులు, సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చెక్ అనే సినిమాతో పాటు మేడే, థ్యాంక్ గాడ్ అనే సినిమాలలో నటిస్తుంది.