రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడందోచ్.!

 

ఈ ఏడాది నాకు దొరికిన గొప్ప బహుమతి నువ్వేనంటూ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘కొండపొలం’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కమర్షియల్ విజయం సంగతెలా వున్నా, రకుల్ ప్రీత్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.

ఓ వైపు ‘కొండపొలం’ సినిమా నేపథ్యంలో దక్కుతున్న ప్రశంసలు, ఇంకో వైపు పుట్టినరోజు వేడుకలు.. వీటి నడుమ, తన ప్రేమ విషయాన్ని కూడా రకుల్ బయట పెట్టేయడంతో రకుల్ అభిమానులు ఓ రేంజిలో సంబరాలు చేసేసుకుంటున్నారు.

రకుల్ – జాకీ భగ్నానీ గత కొంతకాలంగా ప్రేమలో వున్నారు. అయితే, తమ ప్రేమ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఇద్దరూ చాలా జాగ్రత్తపడ్డారు. ఎట్టకేలకు రకుల్, ఈ విషయమై అధికారిక ప్రకటన చేసేసింది. జాకీ బగ్నానీ కూడా రకుల్‌ అంటే తనకున్న ఇష్టాన్నీ, ఆమెపై తనకున్న ప్రేమనీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారట. పెళ్ళి ముహూర్తం కూడా ఖాయమైపోయిందనీ, ఈ నేపథ్యంలో తమ మధ్య ప్రేమ విషయాన్ని ఇద్దరూ బాహాటంగా వెల్లడించారనీ అంటున్నారు.