సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం చాలా సెన్సిటివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఎక్కడా ఛాన్స్ తీసుకోవట్లేదు. ఏ పని చేయాలన్నా ముందు హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. కోవిడ్ సమయం కావడంతో వైద్య బృందాన్ని సెట్లో ఉంచుకుని షూటింగ్ చేస్తున్నారు. వైరస్ రజినీ చెంతకు చేరుకుండా అరడజను వరకు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఒక్క దర్శకుడు తప్ప రజినీని ఎవ్వరూ కలవట్లేదట. కొన్ని నెలల క్రితం షూటింగ్ చేస్తూ అస్వస్థతకు గురికావడంతో ఏకంగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచననే విరమించుకున్నారు ఆయన.
అంతలా ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకుంటున్నారు ఆయన. ఇకపోతే రజినీ త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘అన్నాత్తే’ కొత్త షెడ్యూల్ ముగియగానే ఆయన అమెరికా పయనమవుతారట. కొన్నేళ్ల క్రితం రజినీ అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. వాస్తవం చెప్పాలంటే ఆ సమస్య నుండి చాలా కష్టం మీద కోలుకున్నారు సూపర్ స్టార్. ఇప్పుడు ఆ శస్త్ర చికిత్సకు సంబంధించిన పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్తున్నారు. దగ్గర దగ్గర నెలరోజుల పాటు అమెరికాలోనే ఉండి అన్ని పరీక్షలు చేయించుకుని వస్తారట. వచ్చాక కొత్త సినిమా పనులు స్టార్ట్ చేస్తారట.