సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హై బీపీతో రెండు రోజుల క్రితం జూబ్లి హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రత్యేక వైద్య బృందం రజనీకాంత్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవన్నీ నార్మల్ అని రావడంతో ఈ రోజు తలైవాని డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే ఏ మాత్రం ఒత్తిడి తీసుకోవద్దని ,వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డిశ్చార్జ్ తర్వాత రజనీకాంత్ నేరుగా తన ప్రత్యేక ఫ్లైట్‌లో హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లనున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్‌తో ఆయన కూతురు కూడా ఉండగా, ఆమె ప్రత్యేక జాగ్రత్తల నడుమ తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లనుంది. బీపీ లెవల్స్ పెరగకుండా చాలా జాగ్రత్తగా కుటుంబ సభ్యులు చూసుకోవలసి ఉంది. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువ చేయకూడదని వైద్యులు తెలిపారు. కాగా, బీపీ లోని హెచ్చు తగ్గులతో గత మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్న తలైవర్ త్వరగా కోలుకోవాలని అంతా కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ , లారెన్స్, మోహన్ బాబు వంటి సెలబ్స్ ఆయన ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళన చెందారు.
రజనీకాంత్ కోలుకున్నారు అనే వార్త ఆయన అభిమానులకు ఆనందాన్ని అందిస్తున్నప్పటికీ, ఆయన తన పార్టీ కార్యకలాపాలు మొదలు పెడతారా, లేదంటే రాజకీయప్రవేశం విషయంలో వెనక్కు అడుగు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ‘అన్నాత్తే’ సినిమా చిత్రీకరణలో భాగంగా రజనీకాంత్ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 22న మొత్తం చిత్ర బృందానికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రజనీకు మాత్రం నెగెటివ్ అని తేలింది.