జగన్ మైండ్ సెట్ మీదే సెటైర్ వేసిన రెబల్ 

featured
రెబల్ ఎంపీ రఘురామరాజు వ్యవహారం అధికార పక్షానికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.  ప్రతిపక్షం కంటే ముందుగా ప్రభుత్వ తప్పుల్ని ఎంచుతూ మీడియా ముందు ప్రత్యక్షమవుతున్న రామరాజు ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా నేరుగా ప్రభుత్వ పనితీరును, సీఎం వ్యవహారశైలిని ఎండగడుతున్నారు.  సూచనలు, అభ్యర్థనలు చేసినట్టే చేస్తూ హెచ్చరికలు ఇచ్చేస్తున్నారు.  తాజాగా విశాఖలో నలంద కిశోర్ అనే వ్యక్తి కరోనాతో మరణించారు.  అతనికి కరోనా సోకడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, ఇది ముమ్మాటికీ పోలీస్ హత్యేనని అన్నారు.  అంతేకాదు ప్రభుత్వం ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా తూర్పారబట్టారు. 
 
నలంద కిశోర్ అనే వ్యక్తిని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకుగాను ఆయన్ను అరెస్ట్ చేసి విశాఖ పోలీస్ స్టేషనుకు ఆ తర్వాత కర్నూల్ పోలీస్ స్టేషనుకు తరలించారు.  కర్నూలులో కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న సమయంలోనే ఆయన్ను అక్కడికి తీసుకెళ్లడంతో ఆయనకు కరోనా సోకిందని టీడీపీ నేతలు అంటుండగా ఎంపీ రఘురామరాజు కూడా అదే మాట అన్నారు.  పోలీసుల తీరుతో ప్రజలు భయాందోళనలకి గురవుతున్నారన్న ఆయన పోలీసులకు ప్రభుత్వం మద్దతు తగ్గించాలని అంటూ ఇలాగే ప్రజలకు మాట్లాడే హక్కును, జీవించే హక్కును కాలరాస్తే సంక్షేమ పథకాలు కూడా కాపాడలేవని అన్నారు.  
 
అనడం అంటే మామూలుగా కాదు వైఎస్ జగన్ ఎంతో గొప్పగా భావించి చేస్తూ వచ్చే దఫాలో కూడా అధికారాన్ని కట్టబెడతాయని నమ్ముతున్న నగదు బదిలీ పథకాల అసలు ముసుగు త్వరలోనే తొలగుతుందన్నట్టు మాట్లాడారు.  ప్రజల సొమ్మును తిరిగి వాళ్లకే ఇస్తున్నామని ప్రజలు త్వరలోనే గ్రహిస్తారని, అప్పుడు ఆ పథకాలు మనల్ని కాపాడలేవని, పాలన ప్రజారంజకంగా ఉండాలని హితవు పలికారు.  దయచేసి ప్రజలకు మాట్లాడే హక్కును, జీవించే హక్కును ఇవ్వాలని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నలంద కిశోర్ మృతికి బాద్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు.  మొత్తం మీద వైఎస్ జగన్ ఎంతో గొప్పగా భావిస్తున్న నగదు పంపిణీ పథకాలు ఎంతో కాలం కాపాడలేవనే వాస్తవాన్ని రామరాజు మొహం మీదే చెప్పేశారు.