ఎంపీ పదవికి రాజీనామా: ‘సై’ అంటున్న రఘురామకృష్ణరాజు

raghuramakrishnaraju-ready-for-mp-post-resignation

raghuramakrishnaraju-ready-for-mp-post-resignation

నేనేమీ పదవిని పట్టుకుని వేలాడాలనుకోవడంలేదు. నేను రాజీనామా చేయడానికి సిద్ధం. రాజీనామా చేసి, మళ్ళీ పోటీ చేసి గెలుస్తా.. నేను గెలిస్తే, మీరు మీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసుకుంటారా.?’ అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీకి సవాల్ విసురుతున్నారు. రఘురామకృష్ణరాజుకీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ మధ్య అనూహ్యంగా మాటల యుద్ధం షురూ అయిన విషయం విదితమే. ‘సిగ్గుంటే ఎంపీ పదవికి రాజీనామా చెయ్..’ అంటూ పెద్దిరెడ్డి సవాల్ విసిరిన దరిమిలా, అంతే ఘాటుగా రఘురామ నుంచి రిప్లయ్ వచ్చేసింది. రఘురామ రాజీనామాపై డిమాండ్ గతంలోనే వైసీపీ నుంచి వచ్చింది. ‘నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. నా నియోజకవర్గ పరిధిలో వున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి..’ అని ప్రతి సవాల్ విసిరారు అప్పట్లో. అయితే, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలెవరూ రాజీనామాల విషయంలో అంత సానుకూలంగా స్పందించలేదు. పైగా, ‘రాజీనామాల పేరుతో ఎవరూ సవాళ్ళు విసురుకోవద్దు..’ అంటూ పార్టీ అధిష్టానం, తమ ఎమ్మెల్యేలకు ఘాటైన వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రఘురామరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసి, వేరే పార్టీపైనో.. సొంతంగానో గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే, అధికార పార్టీకి ఆ స్థాయిలో బలం వుంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి, రఘురామ ధైర్యమేంటి.? ఏ ధైర్యంతో ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసుకుంటారా.? అని ప్రతి సవాల్ విసిరినట్టు.? ప్రభుత్వంలో వున్నవారు తమంతట తాము తమ ప్రభుత్వాన్ని కూల్చేసుకోరు గనుక, తన సవాల్ విషయంలో వైసీపీ అధిష్టానం వెనకడుగు వేస్తుందని రఘురామకృష్ణరాజుకి బాగా తెలుసు. ఎంతైనా మాటల మాంత్రికుడాయన.