Raghurama Vs Vijaya Sai Reddy : తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపుచెక్కతో నేనొకటిస్తా.. అన్నది వెనకటి ముతక సామెత. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికీ, అదే పార్టీకి చెందిన లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకీ మధ్య ట్విట్టర్ వేదికగా జరుగుతున్న పోరు కూడా అలాగే తయారైంది. అయితే, ఇది చాలా జుగుప్సాకరంగా తయారైంది.
ఇద్దరి మధ్యా నడుస్తున్న ట్వీట్ల పరంపరలో ‘ప్రేమ బాణాల’ అంశం తెరపైకొచ్చింది. ‘ఎవరి మెప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ళ అనుభవమే ఈ వయసులో పక్క వాళ్ళకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమ కోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పని చేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్ళే రాళ్ళతో కొడతారు..’ అని విజయసాయిరెడ్డి ట్వీటేశారు.
కాగా, ‘నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కు తింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్ళతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందునువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా వుండేలా చూసుకో’ అంటూ రఘురామకృష్ణరాజు స్పందించారు.
అయినా, రాళ్ళతో కొట్టడమేంటి.? ప్రేమ బాణాలు విసరడమేంటి.? ఇద్దరూ తమను తాము పార్లమెంటు సభ్యులుగా భావిస్తున్నారా.? లేదా.? ఒక్కర్ని మాత్రమే కాదు, ఇద్దర్నీ జనం ఛీత్కరించుకునే పరిస్థితి వచ్చిందిప్పుడు.
రఘురామ ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంటుకు ఎన్నికైతే, వైసీపీ అధినాయకత్వం దయా దాక్షిణ్యాలతో రాజ్యసభకు ఎంపికయ్యారు విజయసాయిరెడ్డి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగని, విజయసాయిరెడ్డిని తక్కువ చేసి మాట్లాడలేం. ఆయనా గౌరవ రాజ్యసభ సభ్యులే. రఘురామ కూడా గౌరవ లోక్ సభ సభ్యులే.
తాము ప్రాతినిథ్యం వహిస్తున్న పదవులకు కనీసపాటి గౌరవం ఇచ్చేవాళ్ళయితే, ఇదిగో ఇలా సోషల్ మీడియాలో బరితెగించరు.!