రఘురామ లేఖాస్త్రాలు.. ఎవరి కోసం.? ఎందుకోసం.?

Raghurama Letters

Raghurama Letters

ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు చాలా హామీలు ఇస్తుంటాయి. అన్నిటినీ నెరవేర్చుకుంటూ పోతే.. అసలు సమస్యేముంది.? దేశమెప్పుడో బాగుపడిపోయేది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని పార్టీలదీ ఒకటే తీరు. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చాక, వీలైనంత త్వరగా మేనిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టింది.

90 శాతానికి పైగా హామీలు ఇప్పటికే పూర్తి చేసేశామనీ, మేనిఫెస్టోలో పేర్కొనని అంశాల్ని కూడా ప్రజలకోసం అమలు చేశామని అధికార వైసీపీ చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాల్ని ఎత్తిచూపడమే అజెండాగా పెట్టుకున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, రోజుకో లేఖ విడుదల చేస్తున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎద్దేవా చేస్తూ.

తాజాగా ఆయన నుంచి వరుసగా ఐదో లేఖ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెళ్ళింది. ముఖ్యమంత్రికి లేఖ రాయడం, దాన్ని బహిరంగ పర్చడం.. తద్వారా ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ప్రజల్లో నెగెటివిటీ పెంచాలన్నది రఘురామ ఆలోచన.. అన్నది వైసీపీ ఆరోపణ. చంద్రబాబు కనుసన్నల్లోనే రఘురామ ఇదంతా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే, రఘురామకి ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఆయన చెయ్యాలనుకున్నది చేస్తున్నారు.

ఓ రాజకీయ నాయకుడిగా, ప్రభుత్వాలెలా పనిచేస్తాయో ఆయనకు తెలియదని ఎలా అనుకోగలం.? ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో రఘురామ ఎన్నింటిని నియోజకవర్గ ప్రజలకు నెరవేర్చారో చెప్పాల్సి వుందిప్పుడు. అధికార పార్టీ అలా ప్రశ్నిస్తే, రఘురామ నుంచి సమాధానం వుంటుందా.? ఏదో ఒక అలజడి రేపాలన్న ఆలోచన తప్పితే, రఘురామకి గడచిన రెండేళ్ళలో జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులు కనిపించడంలేదా.?