Pawan Kalyan HHVM: ఔరంగజేబు లాంటి వ్యక్తిని పవన్ ఓడించారు… దుమారం రేపుతున్న రఘురామ వ్యాఖ్యలు?

Pawan Kalyan HHVM: సినీ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీల కంటే కూడా రాజకీయ నాయకులే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు కర్ణాటక ఫారెస్ట్ శాఖ మంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక పైకి వెళ్లిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు పవన్ కళ్యాణ్ గురించి ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

సినిమా విడుదలకు ముందే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఔరంగజేబులాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించారు పవన్‌ కల్యాణ్‌. రియల్‌ లైఫ్‌లో తన సత్తా చాటి.. ఇప్పుడు తెరపై హరి హర వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు. శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో సినిమాలో చూడబోతున్నాం. మీలాగే నేనూ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆవేశం, ఉద్వేగం. ఆయన మంచి నటుడే కాదు మంచి వ్యక్తి. స్కైలాబ్‌ మీద పడుతున్నా ధైర్యంగా ఉండే వ్యక్తి అంటూ ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ పరంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవ్వటమే కాకుండా వైసిపి అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఔరంగ జేబుతో పోల్చడంతో వైసీపీ శ్రేణులు ఈ సినిమాని బాయికాట్ చేయాలి అంటూ పిలుపునిస్తున్నారు.