ప్రభాస్.. ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ హీరో. ఆయన కమర్షియల్ వేలో యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వెళితే మంచి మంచి హిట్లు అందుకోగలరు. అది సేఫ్ గేమ్ కూడ. కానీ ప్రభాస్ ప్రయోగానికి పూనుకున్నాడు. లవ్ స్టోరీ చేస్తున్నాడు. అదే ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ వ్యయంతో సినిమా నిర్మితమవుతోంది. పెద్ద పెద్ద యాక్షన్ కథలు, మాస్ డైరెక్టర్లు ముందు ఉన్నా కూడ ప్రభాస్ ఇలా లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అందులోని కథాబలమే. సినిమా తప్పకుండా గుర్తుండిపోయే ప్రేమ కథగా మిగిలిపోతుందని నమ్ముతున్నాడు ప్రభాస్. అందుకే చేశాడు.
మరి గొప్ప లవ్ స్టోరీ అంటే అందులో ఏం ఉంటుంది… విషాదపూరితమైన ముగింపు ఉంటుంది. అవును.. గొప్ప ప్రేమ కథలన్నీ విషాదంతో ముగిసినవే. చూసే వాళ్ళ చేత, వినే వాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించినవే. కాబట్టే ఆ కథలు ఇప్పటికీ మనకు గుర్తున్నాయి. ఆ కోవలోనే ‘రాధేశ్యామ్’ ఉండబోతుందట. కథలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర చేస్తున్నారు. పూజా హెగ్డే ప్రేరణ రోల్ చేస్తోంది. వీరిద్దరి మధ్యన సాగే ప్రేమ కథ ఆసక్తికరంగా, భావోద్వేగపూరితంగా ఉంటుందట. కథ చివర్లో కథానాయిక పాత్ర హీరో చేతుల్లోనే కన్నుమూస్తుందట. అదే సినిమాకు హైలెట్ అని, ఆ సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషాదపూరిత ప్రేమ కథను మన ప్రేక్షకులు ‘గీతాంజలి, మహర్షి’ తరహాలో గుర్తుపెట్టుకుంటారేమో చూడాలి.