స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామర్ బ్యూటీ రష్మికా మంధాన ప్రధాన పాత్రలలో లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేయగా, ఈ సినిమాని మొదట్లో శేషాచలం అడవుల్లో చిత్రీకరించాలని అనుకున్నారు. కాని కరోనాతో లెక్కలు మొత్తం మారాయి. రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపారు. తాజాగా రెండు షెడ్యూల్స్ పూర్తి కావడంతో పుష్ప మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. గిరిజన ప్రజలు, అధికారుల సహకారంతోనే ‘పుష్ప’ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశామని ధన్యవాదాలు తెలిపారు.
మారేడుమిల్లి మరియు రంపచోడవరం అడవుల్లో తమ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో మళ్లీ కలుద్దాం అని కూడా వారు పేర్కొన్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న పుష్ప సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించగా ఆ లోపు చిత్రీకరణ పూర్తి చేసేందుకు మేకర్స్ క్షణం తీరికలేకుండా వర్క్ చేస్తున్నారు. నవంబర్ లో తొలొ షెడ్యూల్ చేసిన టీం జనవరి లో రెండో షెడ్యూల్ ఫిబ్రవరి 12 నుంచి మూడో షెడ్యూల్ ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశాడట.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడతాడట. ఇందుకోసం చిత్తూరు జిల్లా యాసను ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించి బన్నీ సందడి చేయనున్నాడు. ‘పుష్ప’ సినిమాను రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారట. ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి ఆదరణ పొందాయి.