Puri Jagannath: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అతనికి పక్కన పెడితే మామూలుగా పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలలో సోషల్ మీడియా వేదికగా మంచి మంచి నీతి వాక్యాలు చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే ప్యూరీ మ్యూజింగ్స్ అనే పేరుతో గత కొంతకాలంగా ఆయన అనేక అంశాలపై మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా పూరి జగన్నాథ్ టాయిలెట్ గాడెస్ అనే అంశంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జపాన్ సంస్కృతిలో కొంతమంది దేవతలు ఉన్నారు. అందులో ఒక దేవత టాయ్‌లెట్ గాడెస్. ఆమె పేరు ఉకెమోచి నకోమి. జపాన్‌లో టాయ్‌లెట్ అంటే, ఒక పవిత్ర ప్రదేశం. దానిని శుభ్రంగా ఉంచితే ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతాయని వాళ్ల నమ్మకం. అందుకే వాళ్ల పిల్లలకు చిన్నప్పటి నుంచే క్లీనింగ్ నేర్పుతారు. బాత్రూమ్ తలుపు తెరవగానే గుడ్ ఫీలింగ్ రావాలి. ఎక్కడా ఒక్క మచ్చ కూడా ఉండకూడదు. మంచి సువాసన రావాలి. పరిశుభ్రత అనేది వాళ్ల ఇంటి పనిలో ఒక భాగం. ఎప్పుడు టాయ్‌లెట్ కు వెళ్లినా, వాడుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టడం వాళ్లకు అలవాటు. ఒకవేళ వాళ్లు వేరే వాళ్ల ఇంటికి వెళ్లినా, అక్కడా అలాగే చేస్తారు. పరిశుభ్రంగా ఉండటమనేది వాళ్ల రక్తంలో ఉంది. ఇది శుభ్రత, సౌభాగ్యం, ఆధ్యాత్మికతల కలయిక. ఈ టాయ్‌లెట్ గాడెస్ మీద పాట కూడా ఉంది. అది పిల్లలందరికీ నేర్పుతారు.
ఈ పాటను వారంతా పవిత్రంగా పాడతారు. ఇవన్నీ మనకు జోక్ లా అనిపించవచ్చు. కానీ ఒక మంచి అలవాటుని తర్వాత తరాలు మర్చిపోకుండా పాటించాలంటే, వాళ్ల చేసే పనిమీద భక్తిని పెంపొందించాలి. జపాన్‌లో పబ్లిక్ టాయ్‌లెట్స్ కూడా క్లీన్‌గా ఉంటాయి. ప్రతి మనిషి రోజూ చేయాల్సిన పనులు ఫాలో అవుతారు. ఇంటి ముందు చెప్పులు ఒక క్రమ పద్ధతిలో పెట్టడం, ఇల్లు శుభ్రం చేయటం ఇలా ఎన్నో విషయాల్లో పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఎలా కూర్చోవాలో కూడా చెబుతారు. అక్కడ ఒక్కో మంచి పనికి ఒక్కో దేవత ఉంది. మొత్తం 65 మంది దేవతలు ఉన్నారు. వీరంతా వాళ్ల మతం షింటో నుంచి వచ్చారు. షింటో బుద్ధిజం నుంచి వచ్చింది. బోధిసత్వుడు చెప్పిందే వాళ్లకు వేదం. మనం కూడా మన పిల్లలకు చదువుతో పాటు క్లీన్‌గా ఉండటం అలవాటు చేయాలి. చిన్నప్పుడే ఇంట్లో పనులు చెప్పటం, వస్తువులు సర్ది పెట్టడం నేర్పాలి. పరిశుభ్రంగా ఉండటం అలవాటైతే తెలియకుండా ఇంకెన్నో మంచి అలవాట్లు వస్తాయి అని పూరి జగన్నాథ్ తెలిపారు.