పులస చేప… వేరే వాళ్ల సంగతేమో కానీ.. ఏపీ ప్రజలు ఎక్కువగా ఈ చేప గురించి వింటుంటారు. కానీ.. ఈ చేపను చూడాలంటేనే కష్టం. ఎందుకంటే ఇది ఎక్కువగా దొరకదు. ఈ చేపను తినడం పక్కన పెడితే చూసినా చాలు.. అదే పదివేలు అని అనుకునే వాళ్లూ ఉన్నారు.
ఇండియా మొత్తంలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ పులస చేప దొరుకుతుంది. ఇక.. ఈ చేపకు ఉన్న డిమాండ్ ఏ చేపకు కూడా ఉండదు. అది ఎంత పెద్ద తోపు చేప అయినా సరే పులస తర్వాతే.
పులస చేప రుచి ఒక్కసారి చూస్తే జీవితంలో మరిచిపోలేరట. అంత టేస్టీగా ఉంటుంది. ఆ చేప కోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు అందరూ. కానీ.. అది దొరకడమే చాలా కష్టం.
సాధారణంగా వర్షాకాలం సీజన్ లోనే గోదావరి నదిలో ఈ చేప దొరుకుతుంది. అయితే.. తాజాగా గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారులకు పులస చేప చిక్కింది. కాస్త భారీదే. రెండున్నర కిలోల వరకు బరువు ఉన్న పులస చేప గురించి ఆనోటా.. ఈనోటా తెలిసి అక్కడికి భారీగా చేరుకున్నారు జనం.
ఇక.. దాన్ని దక్కించుకోవడానికి ఒక వేలం లాంటిదే నిర్వహించారు అంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా రెండున్నర కిలోలు ఉన్న చేపకు 1000 రూపాయలు ఉంటుందేమో.. లేదా 2000 వేసుకోండి. కానీ.. ఈ పులసను మాత్రం ఏకంగా 21 వేల రూపాయలు పెట్టి మరీ.. ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. పులసా.. మజాకా.. దాన్ని సొంతం చేసుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేగా.. అంటూ జనాలు అక్కడి నుంచి ఊసురుమంటూ వెళ్లిపోయారు.