ఆంధ్ర ప్రదేశ్: బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మధ్య శృతి మించి చేసిన కొన్ని ప్రకటనలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మీడియా ముందు సోము వీర్రాజు మాట్లాడుతూ…రాయల సీమలో జెండా నాటబోతున్నాం,అధికారంలోకి రాగానే సీమను పరుగులు పెట్టిస్తాం. సీమ అభివృద్దికి రు.20 వేల కోట్లు కేటాయిస్తాం.రాష్ట్రంలో జగన్ సర్కారుకు మేమే ప్రత్యామ్నాయం అంటూ చెలరేగిపోయారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని గమనిస్తున్న సీనియర్ నాయకులు సోము వీర్రాజు మాటలలో అతి మాత్రమే ఉందని విషయం లేదని అనుకుంటున్నారట . అసలు పునాదులే లేని సీమలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు బీజేపీని ఎలా ప్రత్యామ్నాయంగా మారుస్తారో ?ఎలా రు.20 వేల కోట్లు తీసుకువస్తారో అర్ధం కావడం లేదని అంటున్నారు. పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీని బలోపేతం చేసే వ్యూహం లేకుండా, ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారో తమకు అర్ధం కావడం లేదని అంటున్నారు సీనియర్లు.
ఈ క్రమంలోనే గతంలో సీనియర్లు చేసిన ప్రకటనలను కూడా వారు వల్లె వేస్తున్నారు.గతంలో ఎంతో మంది నాయకులు ఇలాంటి ఆర్భాటపు ప్రకటనలు చేశారని.దీనివల్ల ఒరిగింది ఏమీ కనిపించలేదని సీనియర్లు అంటున్నారు.రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ గతంలో చంద్రబాబు హయాంలోనూ అనేక మంది ఊదరగొట్టిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.కానీ, వారంతా ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.పార్టీని నిలబెట్టిన తర్వాత చెప్పాల్సిన డైలాగులను ఇప్పుడే వల్లె వేయడం వల్ల వ్యతిరేక సంకేతాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల సేవలను వినియోగించుకుంటూ పార్టీని ముందు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా సోము వీర్రాజు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో గతంలో రాష్ట్ర చీఫ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అనుసరించిన వ్యూహాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ బలోపేతం కోసం సభ్యత్వాల నమోదును చేపట్టారని. అది మధ్యలోనే ఆగిపోయిందని దీనిని మళ్లీ తెరమీదికి తీసుకురావడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు, ముఖ్యంగా యువతను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. కానీ ఈ వ్యూహాలను పక్కన పెట్టి గాలిలో దీపం పెట్టినట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.మరి సీనియర్ల ఆవేదన, ఆందోళనను అర్ధం చేసుకుని తన వ్యూహాన్ని మారుస్తారో లేదో చూడాలి?