హాథ్రాస్ ఘటనపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై విమర్శల వర్షం కురిపించారు. విద్యార్థులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
లెఫ్ట్ పార్టీల నేతలు, భీమ్ ఆర్మీ కార్యకర్తలు కలిసి ర్యాలీ నిర్వహించారు. బాధితురాలి చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, డి రాజా, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు కార్యకర్తలు మహాత్మా గాంధీ వేషధారణలో ప్రదర్శన నిర్వహించారు. మానవత్వం మంటగలిసిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
హాథ్రాస్ బాధితురాలి ఆత్మకు శాంతి కలగాలంటూ ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. గురువారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రయత్నించిన రాహుల్, ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పోలీసులు నెట్టడంతో రాహుల్ గాంధీ కిందపడ్డారు.