ఇండస్ట్రీలో భవిష్యత్తును డిసైడ్ చేసేది విజయాలే. అందుకే ఆ చిన్న హీరో సక్సెస్ కోసం చాలా రోజులే ఎదురుచూశాడు. అతనే సంతోష్ శోభన్. హీరోగా సెటిలవ్వాలనే ప్రయత్నంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. చివరికి ఎన్నో ఆశలతో ‘ఏక్ మినీ కథ’ చేశాడు. కానీ రిలీజ్ సమయానికి లాక్ డౌన్ అడ్డుపడింది. దీంతో అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి వచ్చింది. ఈ మార్పే అతనికి ప్లస్ అయింది. అడల్ట్ స్టోరీ లైన్ మీద రొపొందిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉంటే తప్పకుండా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఓటీటీలో కాబట్టి ప్రేక్షకులకి ఏకాంతంగా సినిమా చూసే వెసులుబాటు కలిగింది.
అడల్ట్ కథను ఎంత హుందాగా చెప్పినా కథేమిటి అనే విషయానికి వస్తే గొంతు తగ్గించి మాట్లాడుకోవాల్సిందే. కాబట్టే ఓటీటీ రిలీజ్ ఉపకరించింది. మెజారిటీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అయితే వచ్చింది. సంతోష్ శోభన్ పెర్ఫార్మన్స్ కూడ జనాలకు రిజిస్టర్ అయింది. చిన్న సినిమాలకు తగిన హీరో అనే పేరు దక్కింది. దీంతో ఎన్నో ఏళ్లుగా అతను ఎదురుచూసిన ట్రాక్ దొరికేసింది. నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే యువీ కాన్సెప్ట్స్, స్వప్న సినిమాస్, కొణిదెల సుస్మిత లాంటి వారు సంతోష్ శోభన్ హీరోగా చిత్రాలు చేస్తున్నారు.
ఇంకొంతమంది పెద్ద నిర్మాతలు కూడ ఓటీటీ సినిమాలు, చిన్న బడ్జెట్ చిత్రాలు చేయడానికి అతనే తగిన హీరో అని నమ్ముతున్నారు. మొత్తానికి ఓకే ఒక్క విజయం సంతోష్ శోభన్ జీవితాన్ని మలుపు తిప్పి హిట్ ట్రాక్ ఎక్కించింది.