విశాఖ స్టీలు ప్లాంటు అమ్మేస్తున్నారు.. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి.. తిరుపతి విమానాశ్రయాన్ని కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారు. సో.. సమ అన్యాయం చేసేయడంలో కేంద్రం తనదైన ప్రత్యేకతను చాటుకుంటోందన్నమాట.
తిరుపతి విమానాశ్రయ కార్యకలాపాలు ఆశించిన రీతిలో మెరుగుపడకపోవడంతో, ప్రైవేటుకి విమానాశ్రయాన్ని అప్పగించేయడం ద్వారా అభివృద్ధి చేసెయ్యొచ్చన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. ‘ప్రభుత్వం వ్యాపారం చేయదు..’ అని కేంద్రం తరఫున పలువురు కేంద్ర మంత్రులు గత కొద్ది రోజులుగా చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేసేస్తున్నారు.
ఆ ప్రకటనల సంగతేమోగానీ, దేశాన్ని నిలువునా అమ్మేస్తున్నారన్న విమర్శలైతే కేంద్రంలోని మోడీ సర్కార్ మీద గట్టిగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత, కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా చాలా చేయాల్సి వుంది. ప్రత్యేక హోదా సహా చాలా విషయాల్లో కేంద్రం, రాష్ట్రాన్ని లైట్ తీసుకుంది.
రాష్ట్రాన్ని పెద్దన్నలా ఆదుకోవాల్సిన కేంద్రం, తగు రీతిలో ఆదుకోవడంలేదు సరికదా.. రాష్ట్రాన్ని టార్గెట్‌గా చేసుకుని రాజకీయ ప్రయోగాలు చేపడుతోందన్న విమర్శలు రోజురోజుకీ మరింత బలపడుతున్నాయి. అయినా, తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటుకి అప్పగించేయాల్సిన పనేముంది.? అన్న ప్రశ్నకు కేంద్రం వద్ద సరైన సమాధానమే లేదు.
స్టీలు ప్లాంటుని అమ్మేస్తున్న కేంద్రానికి, ఎయిర్ పోర్టు అమ్మేయడం పెద్ద లెక్కేమీ కాదు. ఆ మాటకొస్తే.. రాష్ట్రాన్నీ, దేశాన్ని కూడా అమ్మేయడానికి బీజేపీ దగ్గర ప్రణాళికలు వున్నాయేమో.. అన్నది విపక్షాల విమర్శ. అభివృద్ధి చేయడమంటే, అమ్మేసి సొమ్ము చేసుకోవడం.. అని సరికొత్త రాజకీయ పాఠాల్ని కేంద్రం ప్రజలకు చెప్పదలచుకున్నట్టుంది. అమ్ముకుంటూ పోతే, చివరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మిగిలేదేముంటుంది.?