Telangana: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబూబ్ పల్లి గ్రామానికి చెందిన మరి బాబు అనే ఒక రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటులో భాగంగా రెండు ఎకరాల విలువైన భూమిని కోల్పోయాడు. అయితే భూమి పోయినా పర్లేదు తన కుమారునికి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు లో ఉద్యోగం వస్తుంది అని ఆశపడ్డాడు ఆ రైతు. ఈ క్రమంలోనే కుమారుడి ఉద్యోగం కోసం కేటీపిపి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం దక్కలేదు. దీనితో విసుగు చెందిన మర్రి బాబు ఈ నెల ఒకటవ తేదీన కేటీపిపి ప్రధాన గేటు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
వెంటనే కేటీపిపి అధికారులు అతడిని మంజూరు నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నారు. ఒక మర్రి బాబు హాస్పిటల్లో దాదాపుగా పది రోజుల పాటు చికిత్స పొంది కోలుకున్నాడు. అయితే పది రోజుల పాటు చికిత్స పొందిన బిల్లు దాదాపుగా అరవై వేలు అయ్యింది. మర్రి బాబు బిల్లు కట్టే స్తోమత లేకపోవడంతో, బాధితుడి కుటుంబ సభ్యులు అతనిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. దీనితో తీవ్ర మనోవేదనకు గురైన మర్రి బాబు ఆస్పత్రి గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న హాస్పిటల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇదే విషయంపై హాస్పిటల్ యాజమాన్యం స్పందిస్తూ కేటీపిపి అధికారులు బాధితుడిని ఈ నెల ఒకటవ తేదీన హాస్పిటల్లో జాయిన్ చేశారని, అప్పటి బాధితుడికి ట్రీట్మెంట్ అందించామని, పది రోజులు అవుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా బిల్లులు కట్టలేదని, బాధితులు కోలుకున్న తర్వాత చికిత్సకు డబ్బులు కట్టవలసిందిగా అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఇలా దురదృష్టవశాత్తూ అతను ఇంతలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెప్పుకొచ్చారు హాస్పిటల్ సిబ్బంది. కానీ బంధువులు మాత్రమే ఆస్పత్రి యాజమాన్యం వల్లే మర్రి బాబు ఆత్మహత్య చేసుకున్నాడు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.