గత ఎన్నికలో వైఎస్ జగన్ కు పూర్తి ఆధిపత్యం అందించిన జిల్లాలో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఇక్కడ అన్ని అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు వైసీపీ వశమయ్యాయి. దీంతో వైఎస్ జగన్ జిల్లా నేతలకు మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. జిల్లా నుండి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చారు. సీనియర్ నాయకులు చాలామందే ఉన్నా ఈ ఇద్దరు యువ నాయకులకే జగన్ పట్టం కట్టారు. దీంతో జిల్లాలోనే అసంతృప్తి వినిపించింది. ఆనం కుంటుంబం మంత్రి పదవి దక్కలేదని రగిలిపోతుంతటే నేదురుమల్లి కుంటుంబం నుండి వైసీపీలో ఉన్న రామ్ కుమార్ రెడ్డి అసలు టికెట్టే దక్కలేదని, జగన్ తనను పూర్తిగా పక్కన పెట్టేశారని ఆవేదన చెందుతున్నారు. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా మంత్రులు అనిల్, గౌతమ్ రెడ్డిలు దూకుడుగా వెళుతున్నారు.
వీరి వ్యవహారంతో నెల్లూరు జిల్లా నేతలే కాదు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా వైసీపీలో కూడ అసంతృప్తి మొదలైంది. ప్రకాశం జిల్లా రాయపట్నం పోర్టు అంశం ఎన్నో ఏళ్ల నుండి నలుగుతూనే ఉంది. సీనియర్ నాయకుడు మాగుంట మహీధర్ రెడ్డి రాయపట్నంకు పోర్టు తెచ్చే అభువృద్దికి బాటలు వేయాలని మొదటి నుండి ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నారు. కందుకూరు నుండి కాంగ్రెస్ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి బరిలోకి దిగి గెలిచారు. గతంలో మున్సిపల్ మంత్రిగా కూడ పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావటంలో మహీధర్‌రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు.
2014లో టీడీపీ గెలవడంతో పనులు నెమ్మదించాయి. అయినా మహీధర్ రెడ్డి గట్టిగా పోరాడటంతో చంద్రబాబు నాయుడు పోర్టుకు శంఖుస్థాపన చేశారు. మళ్ళీ ప్రభుత్వం మారడంతో పనులు ఆగాయి. ఎట్టకేలకు జగన్ సర్కార్ తిరిగి పోర్టు పనులను పట్టాలెక్కించింది. ఇంతవరకు భాగం ఉన్నా పోర్టు వ్యవహారంలో నెల్లూరు జిల్లా మంత్రులు అనిల్ కుమార్, గౌతమ్ రెడ్డిలు కలుగజేసుకోవడంతో చిచ్చు రాజుకుంది. రాయపట్నంలో పోర్టు పెట్టి దాని అనుబంధ సంస్థలను నెల్లూరు జిల్లా కావలిలో ఏర్పాటు చేసేలా పావులు కదుపుతున్నారట ఇద్దరు మంత్రులు. ఇదే మహీధర్ రెడ్డికి నచ్చలేదు. గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి పోర్టు, పరిశ్రమల నిర్మాణంపై ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులకు పలు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు ప్రక్రియ మొదలుపెట్టారు అధికారులు.
ఎక్కువ శాతం భూములు నెల్లూరు జిల్లాలోనే సేకరిస్తున్నారు. అంటే పేరుకు పోర్టు రాయపట్నంలో ఉన్నా పనులు, పరిశ్రమలు నెల్లూరులోనే ఉండేలా ప్లాన్ చేశారన్నమాట. దీంతో మహీధర్ రెడ్డి విరుధ్చుకుపడుతున్నారు. భూములిచ్చి త్యాగం ఒకరు చేస్తే ఫలితం ఇంకొకరు తన్నుకుపోతారా. అసలు నెల్లూరు జిల్లా నేతలకు ప్రకాశంలో ఏం పని. ఇక్కడ నాయకులు లేరనా లేకపోతే నెల్లూరు జిల్లా గొప్పదనా అంటూ బాహాటంగానే అంటున్నారట. ఎవరెన్ని కుట్రలు చేసినా పోర్టు పూర్తిస్థాయిలో ప్రకాశం జిల్లాకే అంకితమని, జిల్లాలో బాలినేని, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ఉన్నా ఈ తొక్కుడు వ్యవహారం ఏమిటని, అసలు మహీధర్ రెడ్డే మంత్రి పదవిలో ఉంటే పక్క జిల్లా నేతలకు ఇంత కొమ్ములు వచ్చేవా అంటున్నారట ప్రకాశం ప్రజానీకం.