Prakash Raj: ఆ పవన్ కళ్యాణ్ కు ఎవరైనా చెప్పండయ్యా ప్లీజ్… మరోసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్!

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ ఇటీవల నటుడు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరి మధ్య తిరుపతి లడ్డు వివాదం పై అభిప్రాయ బేధాలు వచ్చాయి. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలను ప్రకాష్ రాజు పూర్తిస్థాయిలో తప్పుపడుతూ వస్తున్నారు.

ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురం సమీపంలో నిర్వహించిన ఈ సభలో భాగంగా ఈయన హిందీ భాష గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి. హిందీ భాష తమిళ సినిమాల డబ్బింగ్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయొద్దు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. భాష వద్దు కానీ డబ్బులు మాత్రం కావాలా అంటూ ఈయన ప్రశ్నించారు. ఇలా హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేస్తూ… మీ హిందీ భాషను మాపై రుద్దుకండి..అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ కు ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అయితే గతంలో కూడా వీరు సనాతన ధర్మం గురించి తిరుపతి లడ్డు వ్యవహారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో తప్పుపట్టారు. ఇక ఈ విషయంపై వీరిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు పూర్తిస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. మరి ప్రస్తుతం పవన్ హిందీ భాష గురించి ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.