ప్రభాస్ అలా మారిపోతాడు అని అస్సలు ఊహించలేదు : కృష్ణంరాజు

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తరువాత డార్లింగ్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తరువాత సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ఇక బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు. ఈ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారి ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్ తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా 20 ఏళ్ళు పూర్తయింది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలతో గ్లోబల్ స్టార్ గా కూడా మారబోతున్నాడు. ఎందుకంటే ఆదిపురుష్ ప్రాజెక్ట్ వంటి పాన్ ఇండియా చిత్రాలను అటు హాలీవుడ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా డార్లింగ్ అభిమానులు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఆల్ ఇండియా రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరియు ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జెఎస్ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో తాజాగా మంగళవారం రోజు హైదరాబాద్ లోని కృష్ణంరాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి.

ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ మరియు నిర్మాత అశోక్ కుమార్ లతో పాటుగా కృష్ణంరాజు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా కృష్ణం రాజు మాట్లాడుతూ.. ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతోంది. నిజంగా ఆ రోజు ప్రభాస్ ని మా గోపి కృష్ణ బ్యానర్ లోనే హీరోగా పరిచయం చేద్దామని ముందు అనుకున్నాం. ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్ దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది.

మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాం అని తెలిపారు కృష్ణం రాజు. అలాగే జయంత్,అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఇలా ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు కృష్ణంరాజు.