బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్ళు కాల్షీట్స్ కేటాయించాడు. తాను పడ్డ కష్టానికి మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ సినిమా తర్వాత ఫుల్ స్పీడ్ పెంచాడు ప్రభాస్. సాహో అనే చిత్రంతో ఇప్పటికే ప్రేక్షకులని అలరించిన యంగ్ రెబల్ స్టార్ జూలై 30న రాధే శ్యామ్ అనే చిత్రంతో పలకరించనున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రాన్ని అక్టోబర్‌లో థియేటర్‌లోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తుండగా, ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్టు సమాచారం.
సమ్మర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రం 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాను 2022లోనే విడుదల చేయనున్నారు. అయితే ప్రభాస్ ల్యాండ్ మార్క్ చిత్రం కోసం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతో కలిసి పని చేసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రభాస్ ల్యాండ్ మార్క్ చిత్రాన్ని నిర్మించనుందట. అలానే ప్రభాస్‌కు మిర్చి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.
ప్రభాస్ దాదాపు ఏడాది వరకు తను కమిటైన సినిమాలతో బిజీగా ఉండగా, కొరటాల ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్నాడు. ఆచార్య చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుండగా, ఈ సినిమాను మే 13న విడుదల చేయనున్నారు. సోషల్ మెసేజ్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో కొరటాల శివ ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ పూర్తైన తర్వాతే ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కోసం కొరటాల ప్యాన్ ఇండియా లెవల్‌లో కథ సిద్దం చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది .