అత్యంత ఆప్తుడని కోల్పోయిన మహేష్ బాబు

Popular PRO BA Raju died due to cardiac arrest
Mahesh babu and BA raju
టాలీవుడ్ ప్రముఖ సినీ పాత్రికేయులు, పిఆర్వో బి.ఏ.రాజు కాలం చేశారు. నిన్న శుక్రవారం రాత్రి మధుమేహం ఎక్కువ కావడంతో గుండెపోటు సంభవించి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.  బి.ఏ.రాజు ఆకస్మిక మరణంతో తెలుగు ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. బి.ఏ.రాజుకు పరిశ్రమలోని దాదాపు అందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలతో సత్సంబంధాలు ఉన్నాయి.  పిఆర్వోగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు బి.ఏ.రాజు.  సినీ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి సూపర్ హిట్ పేరుతో సినీ వార పత్రికను స్థాపించి దశాబ్దాలుగా విజయవంతంగా నడిపిన ఆయన నిర్మాతగా మారి పలు హిట్ సినిమాలు తీశారు. 
 
పిఆర్వోగా వెయ్యికి పైగా సినిమాలకు పనిచేశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకు బి.ఏ.రాజు అత్యంత ఆప్తురు. ఆయన సినిమాలకు బి.ఏ.రాజే పిఆర్వో. ఇక మహేష్ బాబుతో రాజుగారి అనుబంధం చాలా ప్రత్యేకమైంది. మహేష్ సినిమాల్లో దాదాపు అన్నింటికీ బి.ఏ.రాజుగారే పిఆర్వో. చిన్నప్పటి నుండి రాజుగారితో మహేష్ బాబుకు చాలా సాన్నిహిత్యం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ కుటుంబంలో ఒక సభ్యుడి లాంటి వారు బి.ఏ.రాజు అందుకే ఆయన ఆకస్మిక మరణాన్ని మహేష్ జీర్ణించుకోలేకపోతున్నారు.  
 
తనకు అత్యంత ఆప్తుడైన బి.ఏ. రాజుగారి మృతి తమ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు.  అజాతశత్రువు లాంటి రాజుగారి మరణంతో పిఆర్వోలు అందరూ పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది.  ఇండస్ట్రీ ప్రముఖులంతా రాజుగారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.