సినీ నటుడు మహేష్‌బాబు ఇటీవలే తల్లిని కోల్పోయారు.. రెండ్రోజుల క్రితమే తండ్రినీ కోల్పోయారు. అత్యంత బాధాకరమైన సందర్భమిది. కానీ, ఇక్కడ కూడా మహేష్‌బాబు చుట్టూ భయంకరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. కాదు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఎంపీగా గెలిచారు కూడా. కానీ, అది చాలాకాలం క్రితం నాటి వ్యవహారం. అయితే, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో చనువుగా వుండేవారు రాజశేఖర్ రెడ్డి. అలా కృష్ణ ఇమేజ్‌ని వైసీపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కృష్ణ తనయుడు మహేష్ వైసీపీ వైపే వుంటాడంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నాయి.
ఇంకోపక్క, కృష్ణకి అత్యంత సన్నిహితులైన రాజకీయ నాయకుల్లో కేటీయార్ ఒకరు. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దరిమిలా, గులాబీ శ్రేణులు మహేష్ స్టార్‌డమ్‌ని వాడేసుకోవాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో కృష్ణ మరణం, తదనానంతర పరిణామాల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గులాబీ అభిమానులు ప్రయత్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కీ మహేష్‌బాబు అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో జనసేన కూడా మహేష్ ఇమేజ్నా వాడేసుకుంటుందా.? అన్న చర్చ కూడా జరుగుతోంది. ‘మహేష్.. నీకు మేమున్నాం..’ అంటూ నాగబాబు ఇప్పటికే స్పందించారు. అయితే, అది రాజకీయ కోణంలో కాదు.. కృష్ణ, చిరంజీవికి వున్న అనుబంధం, పవన్ – మహేష్ మధ్య వున్న స్నేహం కారణంగానే నాగబాబు అలా అన్నారు.
ఇదసలు సందర్భమేనా.? అన్న ఆలోచన ఎవరికీ లేదు.. రాజకీయ విశ్లేషణలు, రాజకీయ నాయకుల అతి.. ఇబ్బందికర పరిస్థితుల్లో వున్న మహేష్‌ని ఇంకా ఇబ్బంది పెట్టేస్తున్నాయి.