Political Conspiracy In Telangana : సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన. పైగా, తెలుగు బాగానే మాట్లాడతారు. పవర్‌ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారి అయిన ఆయనే స్టీఫెన్ రవీంద్ర. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని హత్య చేసేందుకు కుట్ర జరిగిందంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, నిందితుల్ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చారు స్టీఫెన్ రవీంద్ర.
కేసు వివరాల్ని వెల్లడించే క్రమంలో, ఆయన మాట్లాడిన మాటలు ‘కట్టు కథని’ తలపించాయంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఆరోపిస్తున్నారు. ‘వస్తుంది, జరుగుతుంది..’ అని స్టీఫెన్ రవీంద్ర చెప్పారనీ, అది చెప్పడం కాదనీ, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టుని ఆయన చదివారనీ డీకే అరుణ ఆరోపించారు.
శ్రీనివాస్ గౌడ్ హత్యకు పథక రచన చేసిన నిందితుల్ని అరెస్టు చేయడంతో, వీరికి మాజీ మంత్రి డీకే అరుణ.. బీజేపీ నేత జితేందర్ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలున్నాయనే విషయం బయటపడినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిందితుల్లో ఒకర్ని, జితేందర్ రెడ్డి ఢిల్లీ నివాసం నుంచి పోలీసులు ‘లిఫ్ట్’ చేయడం, దీనిపై కిడ్నాప్ కేసు ఢిల్లీలో నమోదవడం గమనార్హం.
‘అధికార తెలంగాణ రాష్ట్ర సమితి బెదిరింపులకు దిగుతోంది. లేనిపోని కుట్రల్ని తెరపైకి తెస్తోంది. బీజేపీని ఎదుర్కోలేక, బీజేపీ నేతలపై కట్టు కథలు అల్లుతోంది.. ఈ క్రమంలోనే ఈ అక్రమ కేసులు.. వీటిని ఎదుర్కొనే ధైర్యం మాకుంది..’ అంటున్నారు జితేందర్ రెడ్డి.
జితేందర్ రెడ్డి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడిగా పని చేశారు. కేసీయార్‌కి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మెలిగారు. ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వచ్చారు.
15 కోట్ల రూపాయల మేర సుపారీ ఇచ్చి శ్రీనివాస్ గౌడ్‌ని చంపేందుకు ప్రయత్నించారన్నది నిందితులపై అభియోగం. తన ఆర్థిక మూలాల్ని దెబ్బ తీసేందుకు మంత్రి ప్రయత్నించడంతోనే హత్యకు పథక రచన చేసినట్లు నిందితుల్లో ఒకరు విచారణలో అంగీకరించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. (Political Conspiracy In Telangana)…