Police: సీఎం పర్యటనలో.. ఎస్పీల వాగ్వాదం..! ఎస్పీ చెంప మీద కొట్టిన మరో ఎస్పీ

Police: ఇద్దరూ అత్యున్నత పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులే. పెద్దపెద్ద నాయకులకు భద్రత కల్పించే విషయంలో ఇద్దరికీ విశేష అధికారాలున్నాయి. అయినా.. వారిద్దరి మధ్య అవగాహనా లోపం.. సమన్వయం లేక క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఆ ఇద్దరు ఉన్నతాధికారుల కోపాలు, ఇగో పీక్స్ కు వెళ్లాయి. అంతే.. ఇద్దరూ కొట్టుకున్నారు. వారిద్దరిలో ఒకరు జిల్లా ఎస్పీ అయితే.. మరొకరు ఏకంగా ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కావడం విశేషం. హిమాచల్ ప్రదేశ్ లోని కులులో జరిగిందీ ఘటన. అది కూడా.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందే..! ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే..

హిమాచల్ ప్రదేశ్ లోని కులు పర్యటనకు  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వచ్చారు. స్వాగతం పలికేందుకు స్థానిక భుంతార్ విమానాశ్రయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వచ్చారు. పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టు బయట వీరి మధ్య గొడవ జరిగింది. పర్యటన సందర్భంలో స్థానిక రైతు సంఘాలు ఆందోళన చేశాయి. దీంతో.. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి కులు జిల్లా ఎస్పీకి మధ్య వాగ్వాదం జరిగింది. కాన్వాయ్ ఆపి మరీ వాదులాడుకున్నారు. ఇద్దరిమధ్యా మాటా.. మాటా పెరిగి నియంత్రణ కోల్పోయారు. కులు జిల్లా ఎస్పీ గౌరవ్ సింగ్.. సీఎం భద్రతా సిబ్బందిలోని ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్ చెంప ఛెళ్లుమనిపించారు.

దీంతో.. అక్కడే ఉన్న సీఎం భద్రతాధికారి బల్వంత్ సింగ్ ఎస్పీని  కాలితో తన్నారు. అంతే.. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాన్వాయ్ కూడా ఆగిపోయింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది. ఘటనను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వీరిద్దరిపై విచారణకు ఆదేశించింది. ఒక ఎస్పీ మరో ఎస్పీ చెంప మీద కొట్టడం.. ఆ ఎస్పీని మరో పోలీసు ఉన్నతాధికారి కాలితో తన్నడం చర్చనీయాంశమైంది. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుందు ప్రకటించారు. ఈరోజు సాయంత్రం రిపోర్ట్ రానుంది.

Watch video of scuffle between Kullu SP and Himachal CM's security personnel