ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేడి వేడిగా ఉంది. యూపీలోని హత్రస్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతి మీద నలుగురు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో బాధిత యువతి మరణించడం, ఆమె మృతదేహానికి పోలీసులు అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో యూపీ బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అయితే మోదీ ప్రభుత్వంలో దళితులకు, మహిళలకు రక్షణ లేదని, నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది.
అందులో భాగంగానే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఢిల్లీ నుంచి యూపీ బయలుదేరగా ఇద్దరినీ పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్ జిల్లాకు చాలా దూరంగానే వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో రాహుల్, ప్రియాంకాలు కారు దిగి కాలి నడకన బయలుదేరారు. వారితో పాటు కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని వారిని నిలువరించారు. ఈ ఘటనలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముందు నడుస్తున్న రాహుల్ గాంధీని ఆపడానికి చేసిన ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్ రాహుల్ గాంధీని గొంతు పట్టుకుని వెనక్కి నెట్టడంతో ఆయన పక్కనే ఉన్న చెట్లపొదల్లో పడిపోయారు.
దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అలజడి నెలకొంది. హైవే మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ తానూ శాంతియుతంగా నడిచి వెళుతుంటే పోలీసులు అన్యాయంగా కిందకు తోసి లాఠీ ఛార్జ్ చేశారని, దేశంలోని రోడ్ల మీద మోదీ ఒక్కరే నడవాలా సామాన్యులు నడవకూడదా అంటూ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంలో కీలక నేత అయినా రాహుల్ గాంధీ పట్ల పోలీసులు అలా ప్రవర్తించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీకే ఇలాంటి గతి పడితే ఇక సామాన్యుల సంగతేమిటని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.