ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాధినేత చంద్రబాబు నాయుడు అండ్ కో విమర్శలు, ఆరోపణలే పనిగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు. ఏడాదిన్నర కాలంగా పసుపు బ్యాచ్ అంతా అదే పనిమీద ఉంది. ఏనాడు జగన్ సంక్షేమ ఫలాల్ని ప్రశంసించిన సందర్భం లేదు. వాటిలో చిన్నపాటి లోపాల్ని ఎత్తి చూపుతూ సర్కార్ పై విమర్శలు తప్ప..ప్రశంసించింది ఏనాడు. ఆ విమర్శల్నీ..ఆరోపణల్నీ జగన్ వర్గం అంతే ధీటుగా ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఏడాది కాలంగా టీడీపీ నేతలపై జరిగిన దాడుల నేపథ్యంలో జగన్ సర్కార్ ని `రౌడీల రాజ్యం` అంటూ ఎద్దేవా చేసిందా పార్టీ.
వెరసి కొంత మంది పోలీసులు జగన్ మెప్పు కోసం చూపిన అత్యుత్సాహం. మరి అది నిజమేనా? ( డాక్టర్ సుధార్ కని నడిరోడ్డుపై పోలీసులు కొట్టడం..ఇటీవల వరప్రసాద్ ని వైకాపా నేత ఒకరు పోలీసులతో కొట్టించడం వంటి చర్యలు…టీడీపీ పేరుతో కొంత మంది అమాయకులు పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడం) అన్నంత సందేహం కలిగేలా ప్రవర్తించారు. వరప్రసాద్ వివాదంపై ఏకంగా రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ఎంటరై అయ్యారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇందులో పై స్థాయి అధికారులకు సంబంధా ఉందా? లేదా? అన్నది పక్కనబెడితే! జగన్ పై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. అది జనాల్లోకి అంతే బలంగా వెళ్లిపోయింది.
ఇందులో పచ్చ మీడియా కీలక పాత్ర పోషించింది. నందిని కూడా పంది అని చెప్పడంలో ఆ వర్గం మీడియా పండిపోయింది అనడానికి ఏడాది కాలంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక దాడులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కలిసి ఫిర్యాదుల రూపంలో లేఖలు సమర్పించడం వంటివి జరిగాయి. తాజాగా వరప్రసాద్ వివాదం ప్రభుత్వానికి సంకటంగా మారడం..ప్రతిపక్షం స్పీడ్ చూసి యామరపాటుగా ఉన్నామా? అనుకున్నారో? ఏమో తెలియదుగానీ తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు…చెప్పిన లెక్కలు చూస్తుంటే కాస్త కన్ప్యూజన్ ఏర్పడుతుంది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన క్రైం రేటును..జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటివరకూ ఉన్న క్రైమ్ రేటును సవాంగ్ పోల్చారు. 2018-19 లో1044 హత్యలు జరగ్గా, 2019-20 లో 913 నమోదయ్యాయన్నారు. ఇక హత్యా యత్నాలు చంద్రబాబు సమయంలో 2205 జరగగా, ఇప్పుడు 1877, అలాగే అత్యాచారాలు చంద్రబాబు సమయంలో 936 జరగగా, ఇప్పుడు 930 రిజిస్టర్ అయినట్లు సవాంగ్ వెల్లడించారు. మరి ఇలా ఈ లెక్కల వెనుక అసలు ఆంతర్యం ఏంటన్నది తెలియాలి.
-శ్రీకాంత్ కొంతం