కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయాన్నే కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇండియాలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు దాటిన వారికి…. అలాగే… 45 నుంచి 59 ఏళ్ల లోపు వయసు ఉండి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి ఇవాళ్టి నుంచి కరోనా టీకా ఇస్తున్నారు. అందులో భాగంగా… ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధానమంత్రి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రస్తుతం ప్రధాని వయసు 70 సంవత్సరాలు. అందువల్ల 60 ఏళ్లు దాటిన వారి జాబితాలోకి ఆయన వచ్చారు.

Image

తాను తొలి డోసు వ్యాక్సిన్ పొందినట్లు ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కరోనాకి వ్యతిరేకంగా మన దేశ డాక్టర్లు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అర్హులందరూ కరోనా టీకా తీసుకోవాలని కోరారు. మనమందరం కలిసి భారత్‌ను కరోనా లేని దేశంగా తీర్చిదిద్దుదామని మోదీ పిలుపు ఇచ్చారు.

ఇంతకీ మోదీ ఏ వ్యాక్సిన్ వేయించుకున్నారు అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది. మన దేశంలో ఆక్స్‌ఫర్డ్ ఆస్త్రాజెనెకా సృష్టించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, హైదరాబాద్ కంపెనీ భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాగ్జిన్‌కు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి లభించింది. వాటిలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ప్రధాని మోదీ తీసుకున్నారు. ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా… మోదీకి ఇంజెక్షన్ ద్వారా వ్యాక్సిన్ ఇచ్చారు.