ప్రస్తుతం హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఢిల్లీ లీడర్లంతా హైదరాబాద్ గల్లీల్లో తిరుగుతున్నారు. ముఖ్యంగా బీజేపీ అయితే.. కేంద్ర మంత్రులను కూడా రంగంలోకి దించి మరీ ప్రచారం చేయిస్తోంది. ఎలాగైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలన్న కసితో ఉంది.
ఇప్పటికే కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ లో ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ లో ప్రచారం చేయనున్నారు.
అయితే.. 28న సాయంత్రం హైదరాబాద్ కు ప్రధాని మోదీ వస్తారని కేంద్రం నుంచి కబురు వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. అయితే.. ప్రధాని మోదీ వచ్చేది జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం కాదు.. ఆయన వచ్చేది కరోనా వాక్సిన్ పురోగతిని పరిశీలించడానికి.
హైదరాబాద్ లోని భారత్ బయోటెక్.. కోవిడ్ వాక్సిన్ ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఆ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. దీంతో దాని పురోగతి తెలుసుకోవడం కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారు.
అయితే.. పూణెలో పర్యటించి… అక్కడి నుంచి సాయంత్రం ప్రధాని మోదీ హైదరాబాద్ రావాల్సింది కానీ.. ఆయన పూణె షెడ్యూల్ సడెన్ గా రద్దయింది. దీంతో ప్రధాని మోదీ.. పూణె వెళ్లకుండా డైరెక్ట్ గా 28న మధ్యాహ్నమే హైదరాబాద్ వస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు హకీంపేటలోని ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీ లాండ్ అవుతారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ వెళ్లి అక్కడ కరోనా వాక్సిన్ పురోగతిని తెలుసుకుంటారు.