PM Modi : బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన చీప్ లిక్కర్ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ‘బీజేపీ జాతీయ విధానం ఇదేనా.?’ అంటూ దేశవ్యాప్తంగా చాలా పార్టీలు సోము వీర్రాజు వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీని వివిధ సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేస్తున్నాయి. చాలా నేషనల్ మీడియా సంస్థలూ ఈ అంశాన్ని హైలైట్ చేస్తుండడంతో ప్రధాని నరేంద్రమోడీ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారట.
‘ఇంత బాధ్యతారాహిత్యమా.?’ అంటూ ఏపీ బీజేపీ నేతల తీరుపై బీజేపీ కేంద్ర నాయకత్వం మండిపడుతోందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, సోము వీర్రాజు మాత్రం తగ్గేదే లే.. అంటున్నారు. ఆరు రూపాయలకు లభించే చీప్ లిక్కర్, 250 రూపాయలకు ఏపీలో ప్రభుత్వం అమ్మడమేంటని ప్రశ్నిస్తున్నారు.
చీప్ లిక్కర్ మాత్రమే కాదు, అసలు ఏ రకమైన మద్యాన్నీ తాను సమర్థించబోననీ, ప్రజలు దోపిడీకి గురవుతున్న విషయాన్నే తాను ప్రస్తావించాననీ సోము వీర్రాజు తాజాగా వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ వివరణ కూడా ఏమంత సమంజసంగా అనిపించడంలేదు చాలామందికి.
కొత్త ఏడాది ప్రారంభంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. దానిక్కారణం చీప్ లిక్కర్.. అంటూ ఏపీ బీజేపీలోనే ఆఫ్ ది రికార్డుగా చర్చ జరుగుతోంది. కానీ, సోము వీర్రాజు అండ్ టీమ్ మాత్రం.. చీప్ లిక్కర్ వ్యవహారంపై తమ తప్పేమీ లేదంటోంది. కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని చెబుతోంది.
ఏపీ బీజేపీ సమర్థన సంగతెలా వున్నా, సోము వీర్రాజు వ్యాఖ్యల్ని సభ్య సమాజంలో ఎవరూ సమర్థించరుగాక సమర్థించరు. 50 రూపాయలెందుకు.? ఉచితంగా పంచేయొచ్చుగా.. అంటూ సెటైర్లేస్తున్నారు. ఏమో, అదే 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో అవుతుందేమోనంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.