రాజకీయ సలహాదారు అనొచ్చు.. ఎన్నికల వ్యూహకర్త అనొచ్చు. పేరు ఏదైతేనేం.. వందల కోట్ల రూపాయల ఫీజు తీసుకుంటాడాయన. భారతదేశంలో రాజకీయాల పరంగా అత్యంత డిమాండ్ వున్నది ఆయనకే. ఆయనెవరో కాదు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. ఐ ప్యాక్ టీమ్ ద్వారా దేశ రాజకీయాల్ని తన కనుసన్నల్లో నడిపించేస్తుంటాడు ప్రశాంత్ కిషోర్.. అన్న వాదన బలంగా వుంది రాజకీయ వర్గాల్లో. ఆయన ఏ రాష్ట్రంలో ఏ పార్టీ తరఫున డీల్ సెట్ చేసుకుంటాడో, ఆ పార్టీని గెలిపించేస్తాడు. ఇది చాలా రాష్ట్రాల్లో నిరూపితమయ్యింది. తొలుత బీజేపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు అదే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆంధ్రపదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే.. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రశాంత్ కిషోర్‌ని ప్రసన్నం చేసుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలు చాలానే వున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో జతకడుతున్నారు ప్రశాంత్ కిషోర్. దాంతో, 2024 ఎన్నికల్లో బీజేపీ ఖేల్ ఖతం.. అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. నిజమేనా.? వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ, మూడో సారి మాత్రం బొక్కబోర్లా పడుతుందా.? అనే అనుమానాలు బీజేపీలో పెరగడానికి కారణం, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిరగడమే.
కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్‌ని సోనియాగాంధీ ఆహ్వానించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కూడా కోరుతున్నారామె. అయితే, ప్రశాంత్ కిషోర్ మాత్రం, త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు. ఆ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తుల విజయం కోసం ప్రశాంత్ కిషోర్ పని చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తనకు ఎలాంటి లాభం లేదని పీకే భావిస్తున్నారనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పని చేయడమంటే, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ లాభం చేకూర్చుతున్నట్లే.